JAISW News Telugu

KTR:కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే..గుణపాఠం చెప్పడం ఖాయం:కేటీఆర్

KTR:కాంగ్రెస్ ఎన్నికల హమీలు ఎగగొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలకు తెరలేపిందన్నారు భారత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఅర్. గ్యారెంటీలను గాలికొదిలేసి…శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదన్నారు. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..?? అని ప్రశ్నించారు. ఏరు దాటినంక తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నదని, గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నదన్నారు.

శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసమని, ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే..మొండిచేయి చూపించడానికి తొండి వేషాలేస్తున్నదన్నారు. తొమ్మిదిన్నరేళ్ల మా ప్రగతి ప్రస్థానం..తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమని, శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాల శ్వేత పత్రాలే కదా అన్నారు
కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి…తప్పించుకోవాలని చూస్తున్నదన్నారు. నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..అబద్ధాలు .. అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదన్నారు. చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం కాంగ్రెస్ కు అలవాటే అన్నారు.

అప్పుల ముచ్చట్లు చెప్పి ఆరు గ్యారెంటీలను నీరుగార్చాలన్నది అసలు ప్లాన్ చేస్తున్నదని, అంచనాలు..అవగాహన లేకుండానే అర్రాస్ పాటలు పాడినారా అని ప్రశ్నించారు. వందరోజుల్లో నెరవేరుస్తామని చెప్పిన హామీలను ఎట్లా బొందపెట్టాలన్న ఎత్తుగడల్లో భాగమే ఈ నాటకాలని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా.. మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే వుంటామని, ప్రజలు అడుగుతోంది.. శ్వేతపత్రాలు కాదని. గాలి మాటల గ్యారెంటీల సంగతి ఏంటని అన్నారు. కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే..తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని, హామీలు అమలు చేయలేకపోతే..అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ అన్నారు.

Exit mobile version