JAISW News Telugu

Nara Lokesh : కూటమి అధికారంలోకి వస్తే లోకేశ్ కు పగ్గాలిస్తారా?

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : ఏపీలో ఎన్నికలు ముగిసి అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. తమ పార్టే అధికారంలోకి రాబోతుందని ఇటు టీడీపీ..అటు వైసీపీ ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. అయితే టీడీపీ కూటమి అధికారం రావడం ఖాయమని ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. ఈనేపథ్యంలో టీడీపీ శ్రేణులు, రాజకీయ ఆసక్తి ఉన్నవారిలో ఓ చర్చ నడుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే లోకేశ్ కు ఈ సారే పగ్గాలు అప్పజెపుతారా? లేదా టీడీపీని ఇక నడిపించేది లోకేశ్ నడిపిస్తారని చంద్రబాబు ప్రకటన చేస్తారా? అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ వారసుడిగా తమ సంతానాన్ని ప్రకటించడం కొత్త కాదు. వారసుడిని ముందే ప్రకటించి ప్రజల్లోనూ, శ్రేణుల్లో ఎలాంటి సందిగ్ధత లేకుండా  చూసుకుంటూ ఉంటారు. తమిళనాడులో కరుణానిధి తన ఇద్దరి కొడుకుల్లో స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించారు. దీంతో పెద్ద కొడుకు ఆళగిరి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయినా కూడా కరుణానిధి స్టాలిన్ ను వారసుడిగా ప్రకటించి ప్రజల్లో ఆమోదం పొందారు. ఆ తర్వాత స్టాలిన్ పార్టీని నడిపించి సీఎం కూడా అయ్యారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ కూడా కుమారస్వామని తన రాజకీయ వారసుడిగా ప్రకటించి..పార్టీ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.

రాజకీయ ప్రభ ఉన్నప్పుడే వారసులను ప్రకటిస్తే ప్రాంతీయ పార్టీలకు ఏ చిక్కు ఉండదు. లేదంటే వారసత్వ పోరాటం జరిగి పార్టీల మనుగడే ప్రశ్నార్థమయ్యే అవకాశాలూ ఉంటాయి. తెలంగాణలో కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను ప్రకటించలేదు. పార్టీ బాధ్యతలు అప్పజెప్పినా.. సీఎం అభ్యర్థిగా కేటీఆర్ ను ప్రొజెక్ట్ చేయలేదు. టీఆర్ఎస్ సెకండ్ టర్మ్ పాలనలో కేటీఆర్ ను సీఎం చేస్తారని అనుకున్నా కూడా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయేసరికి..ఇప్పుడా పార్టీ అస్థిత్వం కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. కేసీఆర్ రాజకీయ వారసుడిగా ఎవరినీ ప్రకటించకపోవడంతో మున్ముందు కేటీఆర్, హరీశ్ రావులకు  పోరు తప్పకపోవచ్చు.

ఇక ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సారి లోకేశ్ ను వారసుడిగా ప్రకటించి ‘ముఖ్య’పదవి అప్పగిస్తారా..లేదా భవిష్యత్ లో ప్రకటిస్తారా అనే సందేహం అందరిలో కలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పటికే 74 ఏండ్ల వయస్సులో ఉన్నారు. వారసుడి ప్రకటనలో ఏదో విషయం తేల్చాల్సిన సమయమే. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాల్సిన అవసరముంటుంది. అనధికారికంగా లోకేశ్ ఆయన వారసుడు అన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా..రాజకీయ వారసుడిగా ప్రజల్లో ప్రొజెక్ట్ చేయాల్సిన సమయమిదే. మరి చంద్రబాబు మదిలో ఏముంది? అనేది ఎవరికీ తెలియదు. ఆయన ఎలా ఆలోచిస్తున్నారనేది తెలియాలంటే మరో కొద్దిరోజులు ఆగక తప్పదు.

Exit mobile version