Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు ముగిసి అందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే అందరూ ఎక్కువగా ఎదురుచూసేది మాత్రం పవన్ ఎంత మెజార్టీ సాధిస్తారు. జనసేన ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే ఉత్కంఠ అయితే సర్వత్రా ఉంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఎన్ని గెలుస్తారనే విషయంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. కొందరు నాలుగు అంటుంటే.. మరికొందరు.. సగం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా జనసేన నుంచి బలమైన అభ్యర్థులే బరిలో ఉండడం గమనార్హం. ఈ రకంగా చూస్తే 19 నుంచి 20 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక జనసేనాని పిఠాపురంలో గెలవడం ఖాయమని ముక్తకంఠంతో అందరూ అంటున్నారు. కేవలం మెజారిటీ మాత్రమే మిగిలి ఉందని చెబుతున్నారు. జనసేన నుంచి ఇలాంటి గన్ షాట్ నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. వాటలో ఒకవైపు అభ్యర్థుల బలం.. మరోవైపు పార్టీ బలం రెండూ కలిపి.. జనసేనకు కలిసి వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అటువంటి వాటిలో అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. అలానే.. భీమవరంలో పులపర్తి రామాంజనేయులు కూడా గెలుపు ఉట్టి కొడుతారని అంటున్నారు.
ఇంకా జనసేన గెలిచే నియోజకవర్గాల్లో భీమవరం, తాడేపల్లి గూడెం, అనకాపల్లి ఇలా.. మొత్తం 19-20 స్థానాలు ఉన్నట్టు లెక్కలు బయటకు వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. స్థానికంగా ఉన్న కుల సమీకరణలు.. వ్యక్తుల బలాబలాలు వంటివి కూడా కలిసి వస్తున్నాయి. దీంతో జనసేన 20 స్థానాల్లో పక్కా గెలుస్తుందని చెబుతున్నారు. ఒక్క నెల్లిమర్ల స్థానం మినహా.. ఇతర నియోజకవర్గాల్లో గెలుపు దాదాపు ఖాయమేనని ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే పవన్ కు ఇక ఏపీలో తిరుగులేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇటు ప్రభుత్వంలో.. ఆయన మాటకు మరింత వాల్యూ పెంచుతుంది. అదేవిధంగా పార్టీ పరంగా మరింత పుంజుకునేందుకూ అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. పార్టీకి ఇప్పటి వరకు ఎదురైన గాజు గుర్తు సమస్య కూడా పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి 19-20 సీట్లు కనుక జనసేన తెచ్చుకుంటే.. తిరుగులేని చక్రం తిప్పడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ ఎన్నికలు ఇచ్చిన మైలేజీతో జనసేన భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. పవన్ రాజకీయ భవిష్యత్ కు ఢొకా ఉండదనే చెప్పవచ్చు.