YS Sharmila : మీడియాలో షర్మిలకు హైప్ తెస్తే..జగన్ కు డ్యామేజ్ అవుతుందా?
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత దూకుడుగా ముందుకెళ్తున్నారు. తన అన్న, సీఎం జగన్ పై ఏవిధంగా వ్యవహరిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీఎం జగన్ పై రోజుకో తీరుగా విరుచుకుపడుతున్నారు. జగన్ పాలన వైఫల్యాలతో పాటు కుటుంబ పరంగా కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. కుటుంబ విభేదాలకు కారకుడు జగనే అని దానికి తమ అమ్మ విజయమ్మే సాక్ష్యమని ధ్వజమెత్తారు. తాజాగా తన తండ్రి రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు తానూ వైఎస్ షర్మిలనే అవుతానని వైసీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం ఏపీలో మీడియా అటెన్షన్ అంతా షర్మిలపైనే ఉంది. అయితే టీడీపీకి మద్దతుగా ఉంటుందనే పేరున్న ఆంధ్రజ్యోతిలోనూ షర్మిలకు బాగా ప్రచారం ఇస్తున్నట్లు కనపడుతోంది. అయితే షర్మిలను ఎక్కువ హైప్ చేస్తే జగన్ ను డ్యామేజీ చేసి అంతిమంగా టీడీపీకి లబ్ధి చేకూర్చులన్నది ఆ పత్రిక యజమాని ఆర్కే లక్ష్యమని తెలుస్తోంది.
అయితే షర్మిలను హైప్ చేస్తే జగన్ అనుకూల ఓట్లు షర్మిలకు పడుతాయని ఆయన అంచనా కావొచ్చు. అయితే వాస్తవంలో మాత్రం జగన్ అనుకూల ఓట్లు జగన్ కే వేస్తారు తప్పా ఇతరులకు ఎందుకు వేస్తారని విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలో ఉండి జగన్ ను ద్వేషించే వారు కూడా చంద్రబాబుకో, పవన్ కో వేస్తారు తప్ప షర్మిలకు ఎందుకు వేస్తారని అంటున్నారు.
ఒకవేళ టీడీపీ అనుకూల మీడియాలో షర్మిలకు హైప్ తెస్తే జగన్ వ్యతిరేక ఓట్లు టీడీపీ కూటమికి, షర్మిల వైపు చీలపోయి అంతిమంగా జగన్ కే లాభం జరుగుతుంది. ఈ విషయాన్ని వారు గుర్తించాల్సి ఉంది. అయితే షర్మిల వ్యాఖ్యలకు ఎక్కువగా హైప్ ఇస్తే జగన్ ను నైతికంగా దెబ్బకొట్టవచ్చు అని భావించినా.. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికప్పుడు ఏపీలో పెద్దగా ఒనగూరేది ఏమిలేదు. మీడియాలో ఆమెకు హైప్ ఇవ్వడం అంటే ప్రతిపక్షాలకు పడే ఓట్లకు గండి కొట్టడమే అవుతుంది.
ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించి ఇప్పటికైనా షర్మిలకు హైప్ రాకుండా చూసుకోవాలి. అలాగే నైతికంగా జగన్ దెబ్బతీయడం ద్వారా.. అతడికి పడే ఓట్లను టీడీపీ వైపునకు వచ్చేలా చూసుకోవాలి. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, అలాగే రాష్ట్ర అభివృద్ధి టీడీపీ, జనసేనకే సాధ్యమని జనాల్లో నమ్మకం కలిగించాలి. అప్పుడే కూటమి అధికారంలోకి రాగలదు.