RCB Vs CSK : ఆర్సీబీ, చెన్నై ఎవరూ గెలిస్తే వారే ప్లే ఆఫ్స్ కు
RCB Vs CSK : చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మధ్య జరగబోయే కీలక పోరు గురించి ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరాలని ఆర్సీబీ చూస్తోంది. చెన్నై గనక 200 పరుగులు చేస్తే ఛేజింగ్ లో 18.1 ఓవర్లలో ఆర్సీబీ కొట్టేయాలి. బౌలింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. అంటే మ్యాచ్ లో ఆర్సీబీ అసాధారణంగా ఆడితేనే ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
చెన్నై లో రుత్ రాజ్, శివమ్ దూబె ఫామ్ లో ఉన్నారు. వీరిద్దరిని ఆపితేనే చెన్నైను తక్కువ స్కోరుకు కట్టడి చేయవచ్చు. దీంతో పాటు ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరముంది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, పతిరణ అందుబాటులో లేకపోవడం తీవ్ర లోటుగా కనిపిస్తోంది.
ఆర్సీబీ మాత్రం చివరి అయిదు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపు మీద ఉంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని ఈ సారి ప్లే ఆఫ్స్ ఆడాలని ఆర్సీబీ భావిస్తోంది. ముఖ్యంగా విరాట్ కొహ్లి భీకర ఫామ్ లో ఉన్నాడు. కెమరూన్ గ్రీన్ కూడా బ్యాటింగ్ లో ఫామ్ లోకి వచ్చాడు. దినేశ్ కార్తీక్ మొదటి నుంచే ఫామ్ లో ఉన్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా కరణ్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. స్వప్నిల్ సింగ్ పవర్ ప్లే లో కీలక వికెట్లు తీస్తూ ఆర్సీబీకి మెరుగైన ఆరంభాన్నిస్తున్నాడు. విల్ జాక్స్ ఇంగ్లాండ్ వెళ్లిపోవడంతో ఈ మ్యాచులో గ్లెన్ మ్యాక్స్ వేల్ ఆడనున్నాడు. మ్యాక్సీ గనక ఫామ్ అందుకుంటే ఇక ఆర్సీబీకి తిరుగులేదు.
దోని, కొహ్లి ఇద్దరు ఒకే మ్యాచ్ లో కనబడడం కూడా ఇదే చివరి సారి కావొచ్చు. దోని ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ చిన్న స్వామి స్టేడియంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో రెండు టీంలతో పాటు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.