Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అంశాలపై ప్రధాన పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ రుణమాఫీపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తప్పారని.. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమని అన్నారు.
నిరూపించకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 17 మది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకోవడానికి సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాలును స్వీకరించి తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఇప్పుడేమో అమలు చేశామని అబద్దాలాడుతున్నారు. నేను చేసిన సవాల్ ను స్వీకరించే కాంగ్రెస్ నేతలకు దమ్ముందా..? ఎల్లుండి అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ.. ఆలోపు నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా.. ఎన్నికల్లోపు నిరూపించినా సరే.. నేనే స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తా.. దమ్ముంటే నా సవాల్ కు స్పందించాలి’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.