JAISW News Telugu

AP High Court : అరెస్ట్ చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

AP High Court's extreme comments

AP High Court’s extreme comments

AP High Court : పర్చూరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్ట్ చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.

‘‘ఏడేండ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్ట్ కు ఎలా ప్రయత్నిస్తారు? అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. సంబంధిత పోలీస్ అధికారి అరెస్ట్ కు ఆదేశాలు ఇస్తాం. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. అనంతరం తరువాతి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.

ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్యే సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ కంపెనీల్లో ఇటీవల తనిఖీలకు వచ్చిన మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు.

అసలేమైంది..ఏలూరి పిటిషన్ లో ఏముంది..

‘‘గ్రానైట్ కంపెనీల్లో తనిఖీలు చేయకుండా విధులు ఆటంకం కలిగించామనే ఆరోపణలతో మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(నిఘా విభాగం, నెల్లూరు) బాలాజీ నాయక్ గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు కంపెనీల యజమానులతో పాటు నా పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా కేసు పెట్టారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవే. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. మరో వైపు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈలోగానే నన్ను(పిటిషనర్) అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  ఓట్ల తొలగింపు నేపథ్యంలో నన్ను వేధించాలనే ఏకైక ఉద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారు. నాపై నమోదైన ఆరోపణలు పూర్తిగా నిరాధారం. దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. ముందస్తు బెయిల్ మంజూరు చేయండి’’ అంటూ తన పిటిషన్ లో ఎమ్మెల్యే ఏలూరి హైకోర్టును అభ్యర్థించారు.

Exit mobile version