Chandrababu : జగన్ చిత్రహింసలు పెడితే.. ఇప్పుడు చంద్రబాబు గౌరవిస్తున్నారు!
Chandrababu and RRR : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. రఘురామ కృష్ణరాజు తనను ఎదిరించారన్న కక్షతో తన సొంత పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా వైఎస్ జగన్ ఆయనపై రాజద్రోహం నేరం కేసు నమోదు చేయించి స్టేషన్లో విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టించారు. ఆ భయంతో ఆయన దాదాపు నాలుగేళ్ల పాటు ఢిల్లీలోనే తలదాచుకోవాల్సి వచ్చింది. ఓ ముఖ్యమంత్రి .. తన సొంత పార్టీ ఎంపీని చిత్రహింసలు పెడితే కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్ ఎందుకు స్పందించలేదో తెలీదు గానీ ఆయనకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అండగా నిలబడ్డారు. ‘ఆనాడు చంద్రబాబే అడ్డుపడకపోయి ఉంటే విచారణ పేరుతో జరిగిన చిత్రహింసలతో తన ప్రాణాలు పోయేవే’ అని రఘురామ స్వయంగా వెల్లడించారు.
జగన్ హయంలో ఆయన రాష్ట్రంలో తన సొంత నియోజకవర్గం నర్సాపురంలో కూడా అడుగుపెట్టలేకపోయారు. కానీ అదే రఘురామ కృష్ణరాజుని టిడిపిలో చేర్చుకుని ‘ఉండి’నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి తీసుకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆయనని శాసనసభ ఉప సభాపతిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. నేడో రేపో ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడనుంది. రఘురామ కృష్ణరాజు సొంత పార్టీలో అవమానాలకు, చిత్రహింసలకు గురవ్వగా టిడిపిలో మాత్రం మరింత గౌరవం లభిస్తోంది.
విచిత్రమైన విషయం ఏంటంటే.. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనవలసిందిగా జగన్ ను టిడిపి, జనసేనలు కోరుతున్నాయి. షర్మిల కూడా ఒత్తిడి చేస్తున్నారు. లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని సూచిస్తున్నారు కూడా. కానీ మరోపక్క జగన్ ఎవరిని చూసి చాలా భయపడతారో, ఎవరిని అమితంగా ద్వేషిస్తారో వారిద్దరినీ అంటే అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణరాజులని శాసనసభ స్పీకర్, డెప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అంటే పులుల గుహలోకి మేకపిల్లను రమ్మనమని ఆహ్వానిస్తున్నట్లే. వస్తే ఏమవుతుందో జగన్ రెడ్డికి బాగా తెలుసు. కనుక వచ్చే ఎన్నికల వరకు జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టకపోవచ్చు.
అయితే రఘురామ కృష్ణరాజు జగన్‌ని ఎదిరించారు కనుకనే ఆయనకి చంద్రబాబు ఈ పదవి కట్టబెట్టారని అనుకోలేం. ఆనంద గజపతిరాజు, బేబీ నాయిన, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు క్షత్రియ ప్రముఖులను ఈ విధంగా గౌరవించడం ద్వారా రాష్ట్రంలో బలమైన క్షత్రియ సామాజిక వర్గం టిడిపికి దగ్గరవుతుంది కూడా. కనుక రఘురామ కృష్ణరాజుతో జగన్‌కు ఓ పక్క చెక్ పెడుతూనే, రాజకీయంగా టీడీపీకీ మేలు జరిగేలా చంద్రబాబు వ్యవహరించారని భావించవచ్చు.