Bandi Sanjay : హిందువులు తుమ్మితే బీఆర్ఎస్ సమూలంగా తుడిచిపెట్టుకు పోతుందని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలోని ముస్లింలంతా ఒక్కటై బండి సంజయ్ ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
‘‘హిందూ సమాజమంతా తన వెనుకుందని, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా.. కరీంనగర్ లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా..?’’ అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో తెలంగాణ ఉద్యమంలో 1400 మందిని బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు.