CM Revanth : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నాయకులే కాదు జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మూడు నెలలకే కోడ్ రావడంతో ఎన్నో పనులు, పథకాలు ఆగిపోయాయి. వాటన్నంటి పరిష్కారం లోక్ సభ ఎన్నికల కోడ్ కాగానే లభిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల్లో నాలుగు మాత్రమే అమల్లో ఉన్నాయి. మిగతా కీలక హామీలు అమలు కావాలంటే కోడ్ తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఈ కోడ్ ఎప్పుడు అయిపోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే ఇవే కాకుండా మీడియాలో మరో కొత్త విషయం బాగా ఫోకస్ అవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు అన్ని చోట్ల జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు సాగుతున్నాయి. 17 లోక్ సభ నియోజకవర్గాలకు 17 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఈమేరకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలంగాణపై కేసీఆర్ మార్క్ అంటూ ఏదీ ఉండకుండా చేయడంలో భాగంగా ఇప్పటికే టీఎస్ ను టీజీగా, తెలంగాణ తల్లి విగ్రహ రూపు మార్చడం, అధికారిక చిహ్నాన్ని మార్చడం..వంటివి చేస్తున్నారు. అయితే వీటిపై జనాల్లో కూడా సానుకూల స్పందన కనపడడం లేదు. ప్రభుత్వంపై పాలనపై దృష్టి పెట్టాలి కానీ ఇలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తే అనవసర కాలయాపనే అంటున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో పలు జిల్లాల ఏర్పాటుకు ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నారు. అనవసరంగా ఇప్పుడు వాటిని రద్దు చేస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఉదాహరణకు వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి అంటే వరంగల్, మహబూబాబాద్ మాత్రమే మిగులుతాయి. మిగతా జిల్లాలన్నీ రద్దు అవుతాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ మాత్రమే మిగిలి, మిగతావన్నీ రద్దు అవుతాయి. అంటే రేవంత్ సొంత జిల్లాలోనే ప్రతిఘటన ఎదురుకాక తప్పదు. అనవసరంగా జిల్లాల తేనెతుట్టెను రేవంత్ రెడ్డి కదిలిస్తే కొత్త పంచాయితీని కొనితెచ్చుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.