AP Home Minister Anitha : గత ప్రభుత్వ హయాంలో బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈరోజు (గురువారం) ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్-2 లో పూజా కార్యక్రమం అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కుమార్తె రష్మితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనితకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు, చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని అనిత అన్నారు. సామాన్య టీచర్ ను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నాపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని అనిత పేర్కొన్నారు. దిశీ పోలీసు స్టేషన్ల పేరు మారుస్తామని హోంమంత్రి తెలిపారు. పోలీసుల్లో పాత ప్రభుత్వ ఆలోచనల్లో ఎవరైనా ఉంటే పక్కకు తప్పుకోవాలని సూచించారు.
పోలీసులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని, సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అని అన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్న అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధితులు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని హోంమంతి వెల్లడించారు.