HYDRA : చివరి ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలయ్యాయి. ప్రతిపక్షాలు అధికార పక్షాలుగా మరిపోయాయి. అయితే రెండు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాలుగా మారిన బీఆర్ఎస్, వైసీపీలు ప్రభుత్వాలు తీసుకునే ఒక్క ప్రజా వ్యతిరేక నిర్ణయం కోసం వేచి చూస్తున్నాయి. అయితే ఆ అవకాశాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా రూపంలో బీఆర్ఎస్ పార్టీకి అందించినట్లు కనిపిస్తుంది. ఎంతో మంది తమ జీవిత కాలం కష్టాన్ని హైడ్రా కళ్ల ముందే కూల్చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం మీద బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. ఆయా కుటుంబాలు తమ ఆవేదన వినిపించడానికి, తమకు న్యాయం కావాలంటూ “మాకొద్దు ఈ కూల్చివేతల ప్రభుత్వం” అంటూ బిఆర్ఎస్ కార్యాలయానికి బారులుదీరుతున్నారు.
మరి కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ కి ఆ ఒక్క చాన్స్ ఇచ్చిందా.? ఇక ముందు ఇవ్వనుందా ? అంటే ఇప్పట్లో జగన్ కు బాబు ఆ అవకాశం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. గత ప్రభుత్వ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో గాడి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా పెట్టుబడులను రాష్ట్రానికి తిరిగి రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలాగే గత ఐదేళ్లుగా నిద్రావస్థలో మునిగిపోయిన వ్యవస్థలన్నింటిలోను ఆయన చలనం కల్పిస్తూ వాటిని ప్రజాప్రయోజనాల కోసం వినియోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో సమాధి అయినా రాజధాని అమరావతికి తిరిగి జీవం పోస్తున్నారు.
ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిపించుకోగలిగితే ఇప్పుటికే కాదు ఎప్పటికి కూటమి ప్రభుత్వం వైసీపీకి అవకాశం ఇవ్వకపోవచ్చు. అయితే హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిఆర్ఎస్ కు ఒక ఆయుధం దొరికినట్లయితే శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంతో వైసీపీ ని మరోమెట్టు కిందకు దించడానికి ప్రభుత్వానికి మరో ఆయుధం చిక్కినట్లైంది. ఇప్పటికే కాదంబరి జిత్వాని కేసులో వైసీపీ వ్యవహారం ప్రజలలో వైసీపీని దోషిగా నిలబెడితే ఇప్పుడు తిరుమల వివాదం వైసీపీ ని పాతాళంలోకి నెట్టింది. లడ్డు వివాదంలో వైసీపీ ప్రభుత్వం మీదకు దూకుడుగా ముందుకు వెళ్లలేని పరిస్థితి, అలా అని వెనకడుగు వేయలేని దుస్థితి. పైకి మేకపోతు గాంభీర్యాలు వలకపోస్తూ కాలం నెట్టుకు రావలసిన పరిస్థితి వైసీపీది. అయితే బిఆర్ఎస్ కి హైడ్రా దొరికినట్లు తమకు కూడా ఏపీలో ఏదొక ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రభుత్వం నుండి బయటకు రాకపోతుందా అంటు వేయి కళ్లతో రేపటి కోసం వైసీపీ నేతలు , ఆ పార్టీ అధినేత జగన్ బెంగుళూర్ ప్యాలస్ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చక్కర్లు కొడుతూ వేచి చూస్తున్నారు.