Kaushik Reddy : బీఆర్ఎస్ లోనే ఉంటే పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు రావాలని అరికెపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. పాడి కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీకి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతుంటే తెలంగాణ భవన్ కు రావాలన్నారు.
బీఆర్ఎస్ తో పంచాయితీ తనకు లేదని అరెకపూడి గాంధీ అంటున్నారు. నాతోనే పంచాయితీ అని చెప్తున్నారని, తనతో నాకేమైనా భూతగాదాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచి కాంగ్రెస్ లో ఎలా చేరారో తెలుపాలన్నారు. భూ పంచాయితీల్లో సెటిల్ మెంట్ల కోసమే కాంగ్రెస్ గూటికి వెళ్లారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు. అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్ కు రావాలి. అక్కడి నుంచి ఇద్దరం కేసీఆర్ వద్దకు వెళదామని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ లో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.