AP Elections : ఆంధ్రప్రదేశ్ లో అధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా అధికారుల తీరు ఉంటోంది. దీంతో సహజంగా వారి విధి నిర్వహణ విమర్శలకు గురవుతోంది. వారి ఇష్టానుసారం విధులు నిర్వహించడంతో అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణ ఎలా సాగుతుందనే విమర్శలు కూడా వస్తున్నాయి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. జగన్ సర్వీస్ బ్యాచ్ అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. వారిలో కొంత మందిపై ఈసీ వేటు వేసింది. కానీ వారి కన్నా ముందు అసలైన స్వామి భక్తులైన పెద్దలు పదవుల్లో ఉన్నారు. వారి విషయంలోనూ ఈసీ కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ చార్జి అధికారే. సీనియార్టీ పరంగా 11వ స్థానంలో ఉన్న ఆయనను ముఖ్యమంత్రి కావాలనే డీజీపీని చేశారు. కానీ పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించలేదు. తన సొంత పనులు చేసే మనిషిగానే ఆయనను వాడుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఇతర పార్టీల నేతల్ని కంట్రోల్ చేయడంలో అతడి పాత్ర కీలకంగా మారింది. విధులను దుర్వినియోగం చేయడానికే ఆయనను నియమించుకున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.
చీఫ్ సెక్రటరీ పాత్ర కూడా కీలకమే. ఆయన కూడా అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పింఛన్ల వ్యవహారంలో కోర్టు ఆదేశాలను కూడా పాటించడం లేదు. దీంతో ఆయన తీరుపై విమర్శలు పెరుగుతున్నాయి. సీఈవోను డామినేట్ చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈసీ కూడా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గతంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ఏజెంటుగా మారి అధికార పార్టీకి వంత పాడినట్లు విమర్శలున్నాయి. వైసీపీ కార్యకర్తలా వ్యవహరించడంతో ఆయన విధులపై సహజంగానే ఆక్షేపణలు వచ్చాయి. ఇలా అధికారులు ఏపీలో అధికార పార్టీకి ఏజెంట్లుగా మారుతున్నారనే వాదనలు రావడం గమనార్హం. వీరందరిపై చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని, లేకుంటే ఎన్నికల ప్రక్రియకు అర్థమే లేదని విపక్షాలు అంటున్నాయి.