YS Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని లేఖలో తెలిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, పార్లమెంటులో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ నిబంధన పాటించలేదని తెలిపారు.
1984లో లోక్ సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పి.ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని లేఖలో పేర్కొన్నారు. 1994 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగాను 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్ కు లేకపోయినా పి.జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్ధేశంతో ఈ లేఖ రాసినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని స్పీకర్ ను జగన్ కోరారు.