Jagan : హ్యాపీగా దిగిపోతా.. ఎన్నికల ముంగిట జగన్ నిరాశ స్వరం..ఏంటి ఇలా అనేశాడు!
YS Jagan : ‘వైనాట్ 175’ అంటూ ఊరూవాడ ఊదరగొట్టే వైసీపీ అధినేత, సీఎం జగన్ నోటి నుంచి తొలిసారిగా నిరాశపూరిత ‘స్వరం’ వినిపించింది. ‘‘56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా.. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’’ అని నిర్వేద ధోరణితో మాట్లాడారు. ఈయనలో ఇంత మార్పేంటి..175 సీట్లలో గెలుస్తామన్న మనిషి.. ఇలా ‘హ్యాపీగా దిగిపోతా’ అని అనేశాడు ఏంటని జనాలందరూ విస్తుపోతున్నారు.
వాస్తవానికి జగన్ లో ఇంత నిరాశ ఎన్నడూ చూడలేదు. లోపల భయం ఉన్నా కనీసం పైకి ధైర్యంగా కనపడేవారు. కానీ దిగిపోతా అనే మాటలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే జగన్ లో ఈ మార్పు రావడానికి తాజా పరిణామాలే అని తెలుస్తోంది. ఎన్నికల్లో జగన్ పార్టీ ఒంటరి పోరు చేస్తోంది. అటు చూస్తూ టీడీపీ, జనసేన పొత్తు జగన్ కు ముచ్చెమటలు పోయిస్తోంది. మరోవైపు చెల్లెలు షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా తననే అన్ని రకాలుగా టార్గెట్ చేస్తోంది. ఇంట్లో కుటుంబ కలహాలనే సర్దుకోలేని వ్యక్తి.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తన గురించి వారేం అనుకుంటున్నారో అనే ఆందోళన కూడా జగన్ లో ఎక్కువైనట్టు కనిపిస్తోంది.
ఓ రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు జగన్ కు జీవన్మరణ సమస్యే. గెలిస్తే మరో ఐదేళ్లు కేసుల బాధలు లేకుండా ఏదో మేనేజ్ చేయవచ్చు. ఓడిపోతే మాత్రం చాలా కష్టాలు ఎదురుకానున్నాయి. ప్రత్యర్థి అధికార పార్టీలు మళ్లీ కేసులను యాక్టివ్ మోడ్ లోకి తేవొచ్చు. వీటి తీర్పులు ఎలా వస్తాయో తెలియదు. తల్లి, చెల్లి కూడా సపోర్ట్ చేయడం లేదు. ఇవన్నీ ఆయన్ను నిర్వేదంలో ముంచెత్తుతున్నట్లు కనపడుతోంది. అందుకే ఆయన మాటల్లో నిరాశ స్వరం వినపడుతోంది.