Pawan Kalyan : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ 70వేలకు పైగా మెజార్టీతో గెలిచి.. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పిఠాపురం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేందుకు పిఠాపురంలో సొంతింటి కోసం స్థలం చూస్తున్నట్లు తెలిపారు. పిఠాపురంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పిఠాపురం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. అవినీతికి పాల్పడకుండా ప్రజలంతా గర్వపడేలా పని చేస్తానన్నారు. తానెప్పుడు పదవుల గురించి ఆలోచించలేదని, కష్టాలు ఉన్నప్పడు పని చేసే వ్యక్తిగా నిలబడాలనేదే తన అభిమతమన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి సర్కార్ మాత్రం వ్యవస్థలను బలోపేతం చేసి ప్రజలకు చేరువ అవుతుందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో జవాబుదారితనంతో కూడిన పాలన అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగానే సుపరిపాలనను కొనసాగిస్తామని పవన్ స్పష్టం చేశారు. నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని సైతం వైసీపీ నేతలు దాచుకున్నారు. అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న పవన్ కళ్యాణ్.. వాటన్నింటిని తవ్వి బయటకు తీసుకొస్తామంటూ స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని, కానీ చేసిన తప్పిదాలను మాత్రం వదిలివేసే ప్రసక్తే లేదన్నారు.
పన్ను చెల్లింపు విషయంలో నా అకౌంట్స్ ను చూసుకోని నేను… ప్రజల సంపద, జాతి సంపదను ఆడిటర్ లాగా వెతుకుతున్నా. ఇందులో అధికారులను ఏమాత్రం ఇబ్బంది పెట్టనని.. కానీ ప్రజలకు చెందాల్సిన సంపద విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల్లో ఎలాగైతే వందశాతం ఫలితం సాధించామో, ఐదేళ్లలో రక్షిత మంచినీరు లేని ఊరు ఉండొద్దు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన బిడ్డల కోసం ఎంత తపన పడుతానో కానీ, పేద బిడ్డల భవిష్యత్ కోసం అను నిత్యం ఆలోచిస్తూనే ఉంటానన్నారు.