JAISW News Telugu

Chandrababu : ఆరోజు సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను – అరెస్టుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

 Chandrababu

Chandrababu

Chandrababu : నందమూరి బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదలైంది. తొలి గెస్టుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి పలు ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. బాలయ్య, చంద్రబాబు మొదట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇది కలికాలం బావా.. నాడు ద్వాపర యుగంలో బామ్మర్ది భగవద్గీత చెబితే బావ విన్నాడు. ఇప్పుడు బామ్మర్ధి చెబితే బావ వింటున్నాడు అంటూ బాలయ్య నవ్వులు పూయించారు.  బాలయ్య పై ప్రేమతో, మర్యాదగా సమాధానం చెబుతానని ప్రమాణం చేయించారు.  ఈ సందర్భంలోనే చంద్రబాబు అరెస్ట్ అమానుష ఘటన అని బాలకృష్ణ అభివర్ణించారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘అప్పుడు కలిగిన బాధ, ఆవేదన, ఆ సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేను. నంద్యాలలో మీటింగ్ పెట్టాం. అటు నుంచి బస్సు వద్దకు వచ్చి బస చేశా. ఆ రాత్రి మొత్తం బయట గందరగోళంగా ఉంది. తెల్లవారుజామున కిందకి రాగానే ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు.

ఎందుకు అరెస్ట్ చేస్తారని పోలీసులను ప్రశ్నించాను. ముందుగా అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాం. తరువాత నోటీసులు ఇస్తామన్నారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్య దేశంలో చిన్న తప్పు చేసిన వ్యక్తికి సైతం వాళ్లు చేసింది చెబుతారు. వాళ్ల సమాధానం తీసుకుని పరిశీలించి, అది తీవ్రమైన విషయం అనుకుంటేనే అరెస్ట్ చేస్తారు. ఆరోజు ఉదయం నన్ను అరెస్ట్ చేశారు. విచారణాధికారికి బదులుగా మరో అధికారి అక్కడకు వచ్చారు.   మీరు ఎందుకు వచ్చారని అడిగితే తాను సూపర్ వైజర్ అని చెప్పారు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఆరోజు వ్యవహరించారు. నా జీవితంలో ఏ తప్పు చేయలేదు. ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి పనిచేశాను. ఎవరినీ తప్పు చేయనివ్వలేదు. ఆరోజు జరిగిన సంఘటనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. రాష్ట్రంతో పాటు దేశమంతా ఆ అమానుష ఘటనను చూసింది. నేను ఏ రోజు తప్పు చేయలేదు. నిప్పులా బతికాను. ప్రజలు నన్ను తప్పు పట్టరని, నమ్ముతారనుకున్న. తర్వాత అదే జరిగి నన్ను గెలిపించారు.’’ అని చంద్రబాబు అన్నారు.

Exit mobile version