old face to young : ‘ఒక సారి మోసపోవడం నీ తప్పు కాదు.. మరో సారి మోసపోవడం నీ తప్పే’ అన్నాడు స్వామి వివేకానంద. సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత ఎక్కడ చిన్న మోసం జరిగినా ప్రపంచం మొత్తం అప్రమత్తం అవుతుంది. దాని గురించి ఆలోచిస్తుంది. అయినా మరో చోట మోసం జరుగుతూనే ఉంది. ఇందులో కొన్ని మోసాలను చూస్తే నవ్వాలో లేదంటే అమాయకత్వాన్ని చూసి జాలిపడాలో అస్సలు అర్థం కాదు. ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా యవ్వనంగా మారుస్తామని ఒక జంట వృద్ధులను మోసం చేసి రూ. 35 కోట్లతో ఉడాయించింది. ఆ వివరాలను చూద్దాం..
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన రాజీవ్ కుమార్ దూబే అతని భార్య, రష్మీ దూబే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన యంత్రం తమ వద్ద ఉందని దీంతో 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మారుస్తుందని ‘థెరపీ సెంటర్’ ఓపెన్ చేశారు. 10 సెషన్లకు ₹ 6,000, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్‌కు ₹ 90,000 ప్యాకేజీలను అందించారు.’ ఇలా కుంభకోణం చేసి వందలాది మంది వద్ద డబ్బులు వసూలు చేసి ఉడాయించారు. ఈ జంట తమ ఆపరేషన్‌ను పిరమిడ్ పథకంగా మార్చుకున్నారు. ఒక కస్టమర్ తన వెంట మరొక వ్యక్తిని తీసుకువస్తే, వారి తదుపరి సెషన్‌ను ఉచితంగా పొందుతారు. ఇలా లక్షలాది ఒక్కొక్కరి వద్ద లక్షల్లో సొమ్మును తీసుకొని కోట్లు కూడబెట్టుకొని ఉడాయించాడు.