Vijayasai Reddy : జగన్ చెప్పాడని ఆగా.. త్వరలో నేనూ ఓ ఛానల్ పెడతా

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy : వైసీపీ  ఎంపీ విజయసాయిరెడ్డికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఆయనకు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతికీ మధ్య వివాహేతర సంబంధం ఉందనీ.. తాను అమెరికాలో ఉన్నప్పుడు ఆమె గర్భం దాల్చిందనీ ఆమె మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపణలు చేశారు. ఇందుకు కారణం విజయసాయిరెడ్డే అని అన్నారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం పై విజయసాయి రెడ్డి స్పందించారు. తనపై ఓ వర్గానికి చెందిన మీడియాలో వస్తోన్న వరుస కథనాలపై నిప్పులు చెరిగారు. సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నంలో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన.. పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. ఉద్దేశపూరకంగానే అసత్య వార్తలు వండివార్చుతున్నారంటూ మండిపడ్డారు.

అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో.. అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో సొంత పార్టీ వాళ్లయినా సరే వదిలి పెట్టబోనన్నారు. తనపై ఏ మాత్రం ఆధారాలు లేని వార్తలను ప్రసారం చేసిన మూడు తెలుగు న్యూస్ ఛానళ్ల పేర్లను వెల్లడించారు. అందరూ కలిసి కుట్ర పన్ని వ్యక్తిత్వ హననానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకుంటానని అన్నారు.

విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడని, ఏం చేస్తాడని తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ఒక ఎంపీగా తనకు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వసతులు ఉన్నాయో.. వాటన్నింటినీ ఉపయోగించి, తప్పుడు వార్తలు రాసిన వాళ్లకు బుద్ధి చెబుతానన్నారు. ఆ చర్యలు ఎలా ఉంటాయనేది చెప్పి మరీ చేస్తానని, మీడియాకు వెన్నుపోటు పొడిచే ఉద్దేశం లేదన్నారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తానని సాయిరెడ్డి చెప్పారు. జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ గిరిజన కమిషన్, మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తానని వివరించారు. తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే మీడియాకు వ్యతిరేకంగా త్వరలోనే ఓ ఛానల్‌ను స్టార్ట్ చేస్తానని సాయిరెడ్డి అన్నారు.

 

TAGS