mother temple : అమ్మపై ప్రేమకు సలామ్ కొట్టాల్సిందే

mother temple

mother temple

mother temple : సృష్టిలోని ప్రతి జీవి ముందుగా కనులు తెరిచి చూసేది అమ్మనే. సమస్త విశ్వంలో స్వచ్ఛమైన ప్రేమ ఒక్క అమ్మ దగ్గర మాత్రమే దొరకుతుంది. కన్న తల్లి గురించి ఎంత చెప్పినా.. ఏం చెప్పినా తక్కువే.. ఏం   చేసినా తక్కవే. ఆ రుణానుబంధం ఒక్కనాటితో తీరిపోయేది కాదు. అలాంటి తల్లులకు గుండెల్లో గుడి కట్టే బిడ్డల్ని  మన చూస్తూనే ఉన్నాం.  కానీ  ఓ కొడుకు మాత్రం తన తల్లికోసం ఓ ఆలయాన్నే కడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలసలో ఈ ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది.

సనపల కృష్ణారావు, అనసూయాదేవి దంపతుల కుమారుడు శ్రవణ్ కుమార్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నాడు. 2008లో శ్రవణ్ కుమార్ తల్లి కన్నుమూశారు. ఆ కన్నతల్లి జ్ఞాపకాలను కలకాలం గుర్తుంచుకునేలా స్వగ్రామం చీమలవలసలో 2019 మార్చిలో రూ.10 కోట్లతో గుడి నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ ఆలయంలో ప్రధాన గోపురం 51 అడుగులు ఎత్తు ఉండటంతో పాటు పంచగోపురాలను నిర్మిస్తున్నాడు. మూలవిరాట్టుగా మాతృమూర్తి విగ్రహం.. శిలలపై ప్రాచీన నగిషీలతో కట్టడాలు చేపట్టాడు. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలిపేలా ఆలయం మండప స్తంభాలపై చిత్రాలను చెక్కిస్తున్నాడు. దీనికి అమ్మ దేవస్థానం అని పేరు కూడా పెట్టాడు. ఇది కేవలం తన మాతృమూర్తికి నిర్మిస్తున్న ఆలయం మాత్రమే కాదని… అమ్మను దైవంలా చూడాలనే ఆలోచన అందరిలో కలిగించేందుకు ఇలా చేస్తున్నానని శ్రవణ్‌ చెబుతున్నాడు.

ఈ ఆలయ నిర్మాణానికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు శ్రవణ్ చెబుతున్నాడు. దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేపడున్నట్లు చెబుతున్నాడు. ఈ నిర్మాణంలో ఒక్క ఇటుక కూడా వాడడం లేదు. పూర్తిగా గుంటూరు నుంచి తీసుకొచ్చిన కృష్ణ శిలలతో 51 అడుగుల ఎత్తులో పంచగోపురాలతో నిర్మిస్తున్నారు.

కృష్ణశిలలను ఒకదానికొకటి అతికించేందుకైనా సిమెంట్ ఉపయోగించడం లేదు. దీనికోసం పురాతన నిర్మాణాల్లో వినియోగించిన  రాయి బంధన మిశ్రమాన్ని ఉపయోగిస్తున్నారు. తమిళనాడు నుంచి, తుమ్మబంక,  కొబ్బరి పీచు శ్రీశైలం నుంచి, తాడేపల్లిగూడెం నుంచి సున్నం తెచ్చి రాయి బంధన మిశ్రమం తయారు చేస్తున్నారు. ఈ విధానంతో దశాబ్దాల పాటు ఆలయం చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉంటుందని,  ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అమ్మ దేవాలయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడు నుంచి శిల్పులు, ఒడిశా శిల్పకళాకారులతో శిల్పాలు చెక్కిస్తున్నారు. మొత్తంగా శ్రవణ్‌ కుమార్‌కు అమ్మపై చూపిస్తున్న ప్రేమకు అంతా సలామ్ చేస్తున్నారు.

TAGS