Amith Shah : టీడీపీని పొమ్మనలేదు.. కొన్ని విషయాల్లో మద్దతు ఇచ్చినంత మాత్రాన వైసీపీ మాతో ఉన్నట్టు కాదు..
Amith Shah : ఏ రాష్ట్రంలో లేనంతగా రాజకీయ వేడి ఏపీలోనే ఉందనడంలో సందేహం లేదు. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అందరి దృష్టి ఏపీపైనే ఉంది. వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. ఆరు సంవత్సరాలకు పైగా ఎన్డీఏ కూటమికి దూరంగా ఉన్న టీడీపీతో బీజేపీ దోస్తీ కట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీని టెర్రరిస్ట్ అన్న చంద్రబాబుతో ఎలా పొత్తులు పెట్టుకున్నారని బీజేపీని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఈనేపథ్యంలో బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షా ఓ టీవీ చానల్ చర్చలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును తాము ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోవాలని చెప్పలేదని, ఆయనంతట ఆయనే వెళ్లిపోయారని తెలిపారు. తిరిగి మళ్లీ రమ్మని కూడా అనలేదన్నారు. ఆయనంతట ఆయనే తిరిగి వచ్చి చేతులు కలిపారన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎవరినైనా తాము కాదనలేదన్నారు. వచ్చి కలుస్తామంటే వద్దనలేదన్నారు. 2018లో చంద్రబాబు తనంతట తానే ఎన్డీఏ కూటమి నుంచి వెళ్లిపోయారని..అప్పుడు తాము అడ్డుచెప్పలేదన్నారు. అయితే తమను కాదనుకున్న తర్వాత 2019లో ఆయన ఓడిపోయారన్నారు. దీంతో ఆయన రియలైజ్ అయ్యారని, గత అనుభవాల నేపథ్యంలోనే మళ్లీ ఆయనే తమతో చేతులు కలిపారని చెప్పుకొచ్చారు.
ఇక వైసీపీ కూడా చాలా సార్లు బీజేపీకి పలు విషయాల్లో మద్దతు ఇచ్చిందని, అలాగని అన్ని విషయాల్లోనూ తమకు మద్దతు తెలుపలేదన్నారు. మూడు సార్లు తమ విధానాలను వ్యతిరేకించి ఓటింగ్ కు దూరంగా ఉందన్నారు. రాజకీయ పార్టీల మద్దతుతో పొత్తులు ఏర్పడవని, విధానాల పరంగానే ఏర్పడతాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.