BRS : బీఆర్ఎస్ ఓడుతుందని అనుకోలేదు.. ఇప్పటికీ అదే చర్చ..
BRS : ‘‘కేసీఆర్ ఓడిపోతారని అస్సలు ఊహించలేదు..కింద ఎమ్మెల్యేలు కొందరు ఓడిపోయినా.. ఏదోలా కేసీఆరే సీఎం అవుతాడు..’’ చాలా మంది సగటు జనాల్లో ఇదే అనుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగి నెలన్నర రోజులు తర్వాత కూడా వీటిపై విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి.. వాటన్నంటినీ క్రోడికరించి మీకోసం ఈ చిన్న విశ్లేషణ..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క మీడియా కూడా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కవర్ చేయలేదు. ఒక్క ఆంధ్రజ్యోతి, వెలుగు మాత్రం వాటిని ప్రచురించాయి. అయితే వాటిలో కూడా స్వార్థం ఉన్నా.. మొత్తానికైతే ఎంతో కొంత చెప్పగలిగాయి. ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా తమ పాలనా వైఫల్యాల్లో కొన్నింటిని ఒప్పుకుంటుండడం విశేషమే. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం సిట్టింగ్ లను మార్చకపోవడమే అనేది అందరి తొలి విశ్లేషణగా కనిపిస్తుంది. సిట్టింగ్ లను 10 చోట్ల మారిస్తే 9 చోట్ల కొత్త వాళ్లు గెలిచారు. మరో 30మందిని మారిస్తే ఈజీగా బీఆర్ఎస్ గెలిచేది అని అందరూ అంటున్నదే. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ తనను చూసి ఓటేస్తారు అని ఓటర్లను తక్కువ అంచనా వేశారు. పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా వారిని పదేండ్లుగా కొనసాగించడం.. కొని తెచ్చుకున్న ఓటమే అవుతుంది. సదరు ఎమ్మెల్యేలపై భూకబ్జాల ఆరోపణలు, ప్రభుత్వ పథకాల్లో కమీషన్లు తీసుకోవడం, ప్రజలను పట్టించుకోకపోవడం, ఎమ్మెల్యే అనుచరుల దందాలు..ఇలా ఎన్నో కారణాలు వారిని విజయానికి దూరం చేశాయి. అయినా ఇవన్నీ కేసీఆర్ పరిగణలోకి తీసుకోలేదు.
ఇక కేసీఆర్ అహంకారపూరిత ప్రవర్తన, ఉద్యమకారులను అణచివేయడం.. ఫాంహౌస్ నుంచి పాలించడం వంటివి కూడా మేధావులకు, సగటు జనాలకు నచ్చలేదు. అవసరం లేకున్నా పెద్ద పెద్ద విగ్రహాలు, బాగానే ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి 700కోట్లతో కొత్తవి కట్టడం కూడా చాలా మందికి రుచించడం లేదు. కేసీఆర్ తన మొదటి ప్రభుత్వంలో టీడీపీలోని ఎమ్మెల్యేలను లాగేయ్యడం, రెండో టర్మ్ లో కాంగ్రెస్ నుంచి సగం మందిని తన పార్టీలోకి చేర్చుకోవడం.. కూడా ప్రజాస్వామిక వాదులకు నచ్చలేదు.
ఇక ప్రధానంగా నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ మొండిగా వెళ్లారు. దశాబ్దకాలంగా ఉద్యోగాలు లేక వారు విలవిలలాడారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్లు జారీ చేయడంతో అప్పులు తెచ్చి మరి చదివారు. అయినా పరీక్షల్లో అవినీతి, పేపర్ లీకేజీలు.. వాయిదాలు.. ఇలా నిరుద్యోగులు ‘‘తమకు కొలువు రావాలంటే.. కేసీఆర్ కొలువు ఊడగొట్టాలే’’ అని ఫిక్స్ అయ్యారు. నిరుద్యోగుల్లో ఇంతటి వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్ పట్టించుకోలేదు సరికదా.. వారు ఓటు వేయకున్నా మిగతా జనాలు వేస్తారని గుడ్డిగా అహంభావంతో ఎన్నికలకు వెళ్లారు. ఇక ఉద్యోగుల పరిస్థితి అలాంటిదే. కేసీఆర్ పాలనలో 1వ తారీఖు జీతాలు కలగానే మారాయి. డీఏలు, ఫిట్ మెంట్లు..ఇలా వారి సమస్యలను కూడా ఏరోజు కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ రెండు వర్గాలు కేసీఆర్ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించాయి.
ఇలా కేసీఆర్ ఓటమికి ఎన్నో కారణాలు కనపడుతున్నాయి. వీటిని గమనించ మూర్ఖంగా ముందుకెళ్లడమే బీఆర్ఎస్ కొంపముంచిందని గట్టిగా చెప్పగలం. వీటిని పరిష్కరించే అవకాశం ఉండి కూడా పట్టించుకోకపోవడం అనేది క్షమించరానిది. అందుకే ఎన్నికల్లో వారికి ప్రజలు వాత పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పటికీ కొందరికీ బీఆర్ఎస్ ఓడిందనే మాట జీర్ణం కావడంలేదు.