Venu Thottempudi : ఆ హీరోవల్ల డబ్బులు నష్టపోయా.. యాక్టర్ వేణు తొట్టెంపూడి కామెంట్స్
Venu Thottempudi : వేణు తొట్టెంపూడి.. తెలుగు సినీ, రాజకీయ రంగాలను శాసిస్తున్న పెద్ద కుటుంబం అతని బ్యాక్ గ్రౌండ్. తెలుగు తెరమీద ఎంట్రీ చాలా సులువుగానే జరిగిపోయింది. 1999లో స్వయంవరం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. తొలి చిత్రమే బ్లాక్ అందించింది. మరుసటి చిత్రం చిరునవ్వు కూడా మరో సూపర్ హిట్ కావడంతో వేణు వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఆ తర్వాత మల్టీస్టారర్ సినిమాల్లోనూ చేశాడు. మరికొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశాడు. హనుమాన్ జంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, యమగోల మళ్లీ మొదలైంది, గోపి గోపికా గోదావరి వంటి పలు హిట్ సినిమాల్లో నటించాడు. కానీ తర్వాత ప్లాఫ్ లు పలకరించడంతో మళ్లీ సినిమాలు చేయలేదు.
పదేళ్లు గ్యాప్
2013లో చేసిన రామాచారి సినిమా మరో సినిమా చేయలేదు. గతేడాది రవితేజ సినామా రామారావు ఆన్ డ్యూటీలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అయితే ఆ సినిమా ప్లాఫ్ కావడంతో వేణు కెరీర్ మళ్లీ గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు. పదేళ్లు సినీరంగానికి దూరమైన వేణు వ్యాపారంలో మాత్రం బిజీగా మారాడు. కరోనా విపత్కర సమయంలో వలస కూలీలు, కార్మికులకు తనకు తోచిన సాయం చేశాడు.
కెరీర్ ప్రారంభం నుంచి వివాదాలకు దూరంగా ఉన్న వేణు ఒక్కసారిగా స్టార్ హీరోపై బాంబు పేల్చాడు. ఒకానొక సమయంలో సీనియర్ హీరో జగపతి బాబుతో తనకు మనస్పర్ధలు వచ్చాయని వేణు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. హీరో జగపతిబాబుకు తనకు సత్సంబంధాలు ఉండేవని చెప్పారు. తామిద్దరం కలిసి హనుమాన్ జంక్షన్, ఖుషీ ఖుషీగా సినిమాలు చేశామని వెల్లడించారు. హనుమాన్ జంక్షన్ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత తనను సీరియస్గా చూశారని.. మొత్తం దొబ్చేశావ్గా అని ఆటపట్టించారని వేణు గుర్తుచేసుకున్నారు.
మధ్య వర్తిత్వంతో మనస్పర్థలు
జగపతి బాబుకు కారణంగా తాను ఆర్థికంగా నష్టపోయానని వేణు తెలిపారు. ఆయన మధ్యవర్తిగా ఉండి.. వేరే వాళ్లకి డబ్బు ఇవ్వమని చెప్పారని తెలిపారు. ఆయనే స్వయంగా గ్యారంటీ ఉండడంతో ముక్కు, మొహం తెలియని ఓ వ్యక్తికి తాను డబ్బులు ఇచ్చానని, ఆ వ్యక్తి తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో నష్టపోయానని చెప్పారు. అయితే ఈ విషయంలో జగపతి బాబు ఏనాడూ తనకు ఫోన్ చేసి అడగలేదన్నారు. తర్వాత ఆయనను కలవలేదని వేణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రోజుల్లో తాను ఇచ్చింది రూ.14 లక్షలని. అప్పుడు అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పారు. ఈ విషయంలో తనకు చాలా బాధ కలిగించిందన్నారు. వేణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వేణుకి- జగపతి బాబుకి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమైన ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఇప్పటికైతే తెలియరాలేదు.