Deputy CM Pawan Kalyan : తన పూర్తి జీతం వదిలేస్తున్నానని.. దేశం కోసం, నేల కోసం పని చేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పింఛన్ల పంపిణీ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తి జీతం తీసుకుని పని చేద్దామనుకున్నానని, కానీ పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లేవు. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో తెలియడం లేదని అందుకే జీతం వదిలేస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నానని, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తనకు గెలిచినందుకు ఆనందంగా లేదని, పనిచేసి మన్ననలు పొందితేనే నిజమైన ఆనందమని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే నేనున్నానని, విజయయాత్రలు మాత్రమే చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పారు.
‘‘సచివాలయం నుంచి సిబ్బంది వచ్చే వేతనాలకు సంబంధించి పత్రాలపై సంతకాలు పెట్టమంటే నాకు మనస్కరించలేదు. జీతం తీసుకుని పని చేద్దామనుకున్నా. శాఖ అప్పుల్లో ఉంటే నేను జీతం తీసుకోవడం కరెక్ట్ కాదని నా జీతం వదిలేస్తున్నా. నైపుణ్య శిక్షణ కేంద్రాలల ద్వారా యువతలో ప్రతిభ వెలికితీయాలి. పిఠాపురాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా ఆకాంక్ష’’ అని పవన్ పేర్కొన్నారు.