Hydra : ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

Hydra Comments CPI Narayana
AP Hydra : విజయవాడలో సంభవించిన భారీ వర్షాలు, వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులకు చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వం బుడమేరును యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించాలని నారాయణ డిమాండ్ చేశారు. వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయారని వివరించారు.
కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించేలా ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలన్నారు. జాతీయ విపత్తు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్లను కేటాయించాలని, విపత్తులు సంభవించినప్పుడు ఆ నిధులు వాడుకోవచ్చని తెలిపారు. సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాత్రింబవళ్లు తిరిగి బాధితులకు సహాయక చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు. వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచాలని, నష్టపోయిన విద్యార్థులకు ప్రత్యేకంగా సాయం అందించాలని కోరారు. తెలంగాణలో తరహా ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.