Hydra : హైదరాబాద్ సిటీలోని అడిక్ మెట్ డివిజన్ రాంనగర్ లో రోడ్ల నాలాలు, ఆక్రమణలపై జీహెచ్ఎంసీ, హైడ్రా ఫోకస్ పెట్టింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా ఆఫీసర్లు ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బుల్‌డోజర్లతో కూల్చివేతలు చేపట్టింది.
రాంనగర్ లోని మణెమ్మ గల్లీలోని సర్వే నెం.1-9-189కు చెందిన స్థలంలో విక్రమ్ యాదవ్ అనే వ్యక్తి అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమీషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆఫీసర్ల నివేదికలో అక్రమ కట్టడాలని తేలడంతో కూల్చివేతలు మొదలుపెట్టారు.