Harthik : హార్థిక్ కు ప్రత్యామ్నాయంగా హైదరాబాదీ ప్లేయర్
Harthik : శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు ఎంపికలో తన మార్క్ చూపెట్టాడు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూనే యువకులకు కూడా అవకాశం కల్పించింది. జూలై 27 నుంచి ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌కు స్టార్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. టీ20 జట్టులో కొనసాగుతున్నప్పటికీ సెలెక్షన్ బోర్డు హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్ గా అవకాశం ఇవ్వలేదు. అలాగే వైస్ కెప్టెన్ గా కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. ఇక ఆగష్టు 2 నుంచి మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగిస్తూ బీసీసీఐ జట్టును ప్రకటించింది.
వన్డే సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ తో పాటుపాండ్యాకు కూడా జట్టులో అవకాశం కల్పించలేదు. అయితే వారిద్దరిని విశ్రాంతి కోసం పక్కన పెట్టలేదని సమాచారం. టీ20ల్లో చెలరేగే సూర్యకుమార్ యాదవ్ కు వన్డే ఫార్మాట్‌లో మాత్రం రాణించడం లేదు. 37 వన్డేలు ఆడిన సూర్య 25 సగటుతో 773 కేవలం పరుగులే మాత్రమే చేశాడు. గత వన్డే ప్రపంచ కప్‌లో అతని ఆటతీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు హార్దిక్ టీ20ల్లో రాణిస్తున్నా వన్డే ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఫిట్‌గా లేడని తెలుస్తున్నది. పది ఓవర్ల పాటు బౌలింగ్ చేసి, బ్యాటింగ్ చేసేలా సన్నద్ధమైతేనే హార్దిక్ ను తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది. దేశవాళీ క్రికెట్‌లో హార్ధిక్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాండ్యా, సూర్యను వన్డే జట్టు నుంచి తప్పించారని తెలుస్తున్నది. వాళ్ల స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజాను వన్డే సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ను మరింత రాటుదేల్చాలని బీసీసీఐ భావిస్తున్నది. బీసీసీఐ పేస్ ఆల్‌రౌండర్ ను వెతికే పనిలో పడింది. హార్దిక్‌కు ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌ను తీసుకురావాలని చూస్తున్నది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆల్‌రౌండర్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన జింబాబ్వే పర్యటనకు నితీశ్ కుమార్ రెడ్డి తొలుత ఎంపికయ్యాడు.
గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత టీమిండియాకు వీలైనంత త్వరగా తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ 24లో నితీశ్ కుమార్ రెడ్డి బ్యాట్ తో విధ్వంసం సృష్టించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న నితీశ్ కుమార్ రెడ్డిని అదృష్టం వరించింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఎంపికయ్యాడు.