JAISW News Telugu

Canada : కెనడాలో హైదరాబాదీ మృతి..కారణమిదే..!

Canada

Canada News,

Canada News : మన దేశ యువత ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాల బాట పడుతున్నారు. ఈ మధ్య ఇది పెరిగిందనే చెప్పాలి. స్వదేశంలో చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం, నోటిఫికేషన్లు వేసినా ఏండ్ల తరబడి కొనసాగడం, ఇక ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దామంటే జీతాలు తక్కువ. దానికి కూడా నానా చాకిరి చేయాల్సిందే. ఇక చదువుల విషయం కూడా అలాంటిదే. దీంతో యువత విదేశాల్లో మెరుగైన చదువులు, ఉన్నత ఉద్యోగాల కోసం అర్రులు చాస్తున్నారు.

విదేశాల్లో ఉన్నత విద్యను ఆర్జించి మంచి ఉద్యోగం సాధించాలనుకున్నా ఓ యువకుడి కలలు కల్లలు అయిపోయాయి. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడంతో అతడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన ఓ హైదరాబాదీ వాసి కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు వదిలాడు. అతడి డెడ్ బాడీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్ ను అభ్యర్థించింది.

హైదరాబాద్ కు చెందిన 25 ఏండ్ల షేక్ ముజమ్మిల్ అహ్మద్ 2022లో కెనడాకు వెళ్లాడు. ఒంటారియాలోని కొనెస్టోగా కాలేజీలో ఐటీ మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులగా జ్వరంతో బాధపడుతున్న అతడు..గత శుక్రవారం కార్డియక్ అరెస్ట్ తో చనిపోయాడు. అతడి స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చినట్టు ఎంబీటీ పార్టీ అధికార ప్రతినిధి అజ్మద్ ఉల్లాఖాన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. అహ్మద్ కుటుంబ సభ్యులు కేంద్ర విదేశాంగ శాఖకు రాసిన లేఖను కూడా ఆయన పోస్ట్ చేశారు. వీలైనంత త్వరగా డెడ్ బాడీని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని కోరారు.

కాగా, ఇటీవలే హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి అమెరికాలోని చికాగోలో దాడికి గురైన సంగతి తెలిసిందే. ఈనెల ప్రారంభంలో లంగర్ హౌస్ హషీమ్ నగర్ కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో తనపై జరిగిన దాడిని అలీ వీడియో ద్వారా వెల్లడించారు. అతడికి అవసరమైన సాయం అందిస్తామని చికాగోలోని భారత ఎంబసీ హామీ ఇచ్చింది.

Exit mobile version