Hyderabad Joint Capital : రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్లుగా, పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న గడువు జూన్ 2తో ముగియనుంది. అప్పటి నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండబోతోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తికాలేదు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు సైతం పూర్తిగా అమలుకాలేదు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. అధికారిక వర్గాల ప్రకారం, రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9 మరియు షెడ్యూల్ 10లో జాబితా చేయబడిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పూర్తికాలేదు. ఈ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు 9వ షెడ్యూల్ లో జాబితా చేయబడ్డాయి. అలాగే చట్టంలోని 10వ షెడ్యూల్ లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్మెంట్ పొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్, ఏపీ ఫారెస్టు అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మరియు ఏపీ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి.