Hyderabad : అదే జరిగితే హైదరాబాద్ ఇక అద్భుతమే..
Hyderabad : రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారబోతున్నాయి. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే అత్యంత పట్టణీకరణ ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా మారబోతుంది. తెలంగాణలో 3.5 కోట్ల జనాభా ఉంది. అందులో హైదరాబాద్, దాని చుట్టు పక్కల జనాభా దాదాపు 2 కోట్ల దాక ఉంది. హైదరాబాద్ కు దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో పట్టణీకరణ జరుగుతోంది. భవిష్యత్ లో ఇది మరింత పెరగనుంది. దీంతో మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈనేపథ్యంలో రీజినల్ రింగ్ రోడ్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మించనున్నారు.
తాజాగా దీన్ని అనుసరిస్తూ నిర్మించబోయే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు అలైన్ మెంట్ రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు ప్రారంభించింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లోకేషన్ సర్వే పనులకు శ్రీకారం చుట్టింది. స్థూలంగా లైన్ మార్గం ఎలా ఉండాలో డెస్క్ టాప్ స్టడీ మొదలుపెట్టింది. ఇది పూర్తికాగానే, హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ప్రారంభించనుంది. దీని ద్వారా అకాంక్ష, రేఖాంశాలను ఫిక్స్ చేస్తూ అలైన్ మెంట్ సిద్ధమవుతుంది.
హైదరాబాద్ కు అన్ని వైపులా విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 50 కి.మీ. నుంచి 70 కి.మీ వరకు రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటికే 158 కి.మీ నిడివి గల ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలువబోతోంది. ప్రస్తుతం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక దాదాపు 182 కి.మీ. నిడివితో ఉండే దక్షిణ భాగానికి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ అలైన్ మెంట్ ను రూపొందించి ఎన్ హెచ్ ఏఐకి సమర్పించింది.
త్వరలో కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరగానే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ రీజినల్ రింగ్ రోడ్డును అనుసరిస్తూ ఔటర్ రింగ్ రైల్ పేరుతో రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. గతేడాది ఈ ప్రాజెక్టు ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ రూ.13.95 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ పనులు మొదలయ్యాయి. ఈ రైలు మార్గంలో దాదాపు 50 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉంది.