Hyderabad Rain : హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురవడం ప్రారంభమైంది. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా ఎక్కువైంది. గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, అమీన్ పూర్, బీహెచ్ఎల్ తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. బషీర్ బాగ్, హిమాయత్ నగర్, బిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో జన జీవనం స్థంభించిపోయింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నీరు చేరుకుని చెరువులను తలపించింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది వాహనాలు ముందుకు కదలలేక భారీగా ట్రాఫిక్ జాం అయింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల పంటనష్టం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రానున్న 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.