Raja Singh : లోక్ సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సన్నద్ధం అవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర బీజేపీ 400 సీట్ల పైబడి గెలవాలని ఆకాంక్షిస్తోంది. అందుకే ప్రతీ రాష్ట్రానికో వ్యూహాన్ని రచిస్తోంది.
తెలంగాణలో బీజేపీ మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో బీఆర్ఎస్ ను పరిధిని తగ్గించి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. తెలంగాణకు మోదీ చేసిన అభివృద్ధి, పనుల కంటే హిందూత్వ వైపే మొగ్గు చూపుతోంది. దేశంలో కీలకమైన ముస్లిం పార్టీ ఎంఐఎం. ఈ పార్టీ కేంద్ర స్థానం హైదరాబాదే. దేశంలోని ముస్లింలకు ప్రతినిధిగా అసదుద్దీన్ ఓవైసీ చెప్పుకుంటారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ ను బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు ప్రచారమవుతున్నాయి.
తెలంగాణలో ‘హిందూత్వ’ను బయటకు తీసి.. దాని ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. అసదుద్దీన్ కు వ్యతిరేకంగా బలమైన హిందూత్వ వాది, సంచలన వ్యాఖ్యలకు కేంద్రబిందువైన రాజా సింగ్ ను బరిలోకి దింపితే హిందూత్వ నినాదం రాష్ట్రమంతా వ్యాపిస్తుందని అనుకుంటోంది. రాజాసింగ్ , అసదుద్దీన్ పరస్పర వ్యాఖ్యానాలు, ఆరోపణలతో బీజేపీ నిత్యం వార్తల్లో నిలువడం ఖాయం. హైదరాబాద్ నియోజకవర్గ ఓటర్లు మత ప్రాతిపదికన చీలిపోనున్నారు.
కాగా, బీజేపీ వ్యూహం ఆ పార్టీకి లాభించినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం లాభం ఉండదనే చెప్పవచ్చు. ఎన్నికలంటే అభివృద్ధిపై చర్చ జరగాలి కానీ వీరి పోటీతో మతంపైనే చర్చ జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదనే చెప్పాలి.