Murder : హైదరాబాద్ కు చెందిన ఓ బిల్డర్ ను కర్నాటక రాష్ట్రంలోని బీదర్ లో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటనపై కర్నాటకలోని మన్నేకెళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉండే కుప్పాల మధు(48) బిల్డర్ గా ఉంటూనే ట్రావెల్స్ బిజినెస్ కూడా చేస్తుంటారు. అతడికి భార్య వెంకటలక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, అఖిల ఉన్నారు. మధు వ్యాపార పనుల నిమిత్తం తరుచూ బీదర్ కు వెళ్లేవారు. ఈక్రమంలోనే ఈ నెల 24న బీదర్ కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్ కోసం తనతోపాటు చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్(32), వరుణ్, లిఖిత్ సిద్ధార్థ రెడ్డిని తీసుకెళ్లారు.
రాత్రి 10గంటలకు భార్య ఫోన్ చేయగా హైదరాబాద్ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద డెడ్ బాడీ ఉందని, కారు నంబర్ ఆధారంగా మృతుడు మధు అని గుర్తించారు. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులుకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మన్నేకెల్లి పోలీసులు ఘటనాస్థలంలో పరిశీలించగా మధు తలపై బండరాయితో కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం మధు ఒంటిపై ఉన్న రూ.6లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు కనిపించడం లేదు. నిందితులు వీటిని తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. మధు హత్య వెనక అతడితో పాటు బీదర్ కు వెళ్లిన చింతల్ కు చెందిన ముగ్గురి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.