Husband : సహచర విద్యార్థినిపై భర్త అత్యాచారం.. వీడియోలు తీసిన భార్య
Husband : తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. ఎల్ఎల్బీ చదువుకుని సమాజంలో ఉన్నతంగా బతకాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని గంజాయి ఊబిలోకి దించారు. అనంతరం భర్తతో అత్యాచారం చేయించి భార్య వీడియోలు తీసింది. అనంతరం ఆమెను వేధింపులకు గురి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన దంపతులు ఆమె నుంచి డబ్బులు డిమాండు చేసిన ఘటన తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.
తిరుపతి గ్రామీణ పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి నాలుగేళ్ల కిందట తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరింది. కొంతకాలం కాలేజీ హాస్టల్లో ఉండేవారు. ఆ సమయంలో తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ తో స్నేహం ఏర్పడింది. తరచూ ఆమె ఇంటికి వచ్చిపోయేవారు. ఆ సమయంలో ప్రణవకృష్ణ భర్త కృష్ణకిషోర్‌రెడ్డితో పరిచయమైంది.
తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన అతను ఎస్వీయూ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గంజాయికి బానిసలైన దంపతులిద్దరూ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చే యువతికి కూడా అలవాటు చేశారు. యువతి మైకంలో ఉన్నప్పుడు కృష్ణకిషోర్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దృశ్యాలను అతడి భార్య చిత్రీకరించింది. తరువాత వాటిని చూపించి బెదిరించి యువతి నుంచి బంగారు నగలు తీసుకున్నారు. చివరకు ప్రణవ్‌కృష్ణ ఆ ఫొటోలు, వీడియోలను బాధిత యువతి సోదరుడితోపాటు ఆమెకు కాబోయే భర్తకు పంపి డబ్బులు డిమాండు చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు ఈ నెల 25న తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణకిషోర్‌రెడ్డి, ప్రణవకృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు.