Ramana Dixitulu : చంద్రబాబు ప్రభుత్వంలో రమణ దీక్షితులపై వచ్చిన ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాటిని చూపూతూ వైసీపీ నాయకులు నానా యాగి చేశారు. దీంతో టీటీడీ వైసీపీ నాయకులపై పరువు నష్టం కేసు వేస్తే.. అధికారంలోకి వచ్చాక కేసు విచారణను నిలిపివేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి రమణ దీక్షితులు ఆరోపణలు కలకలం సృష్టించాయి. నేరుగా కాకుండా లీక్డ్ వీడియోలో చేశారు.
ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్
పరమ పవిత్రమైన తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ ఆరోపించారు. దీంతో టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉద్యోగులుగా ఉన్నారని రమణ దీక్షితులు విమర్శించారు. ‘ఈవో కొడుకు చనిపోతే దహనం చేయకుండా ఖననం చేశారన్నారు.
అహోబిలంలో గుప్త నిధులు
ఈ మధ్య కొత్త విషయం బయటపడిందని.. అహోబిలంలో 200 సంవత్సరాల క్రితం కొండమీద గుహలో ఓ జీయర్ సమాధి అయ్యారట. ఆయన సమాధి సమయంలో విజయనగర సామ్రాజ్యం ఉండడంతో పెద్ద ఎత్తున వజ్ర, వైడూర్యాలు పెట్టారని అనుకుంటున్నారు. ఆ జీయర్ తర్వాత వచ్చే జీయర్ కు ఆ నిధి చెందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని అహోబిలం జీయర్ వద్దకు ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని సంచలన విషయం చెప్పారు. బెంగళూర్ లో ఆర్కియాలజీలో పురుషోత్తం రెడ్డి అనే అధికారి ఉన్నాడనీ, అతను ధర్మారెడ్డి మనిషి అన్నారు.
పరకామణిలో తవ్వకాలు..
తిరుమల కిచెన్ (పరకామణి)లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటాయని రమణ దీక్షితులు ఆరోపించారు. గుట్కాలు తినే వారు ఇక్కడ పని చేస్తున్నారు. పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేపడుతున్నట్లు చెప్పారు. అంతకు ముందు రాతి బండలు ఉండేవని దానిపై పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. వేయికాళ్ల, దేవ మండపం గుప్త నిధుల కోసం తవ్వారని ఆరోపించారు. ఆలయం లోపలి గోడలకు డ్రిల్ చేస్తూ నాశనం చేస్తున్నారన్నారు.
అమిత్ షా కు లేఖ
రమణ దీక్షితులు మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై రామచంద్ర యాదవ్ సీరియస్‌గా స్పందించారు. తిరుమల విషయంలో వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయన్నారు. మరణ దీక్షితులు చెప్పిన మాటలను కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరగా.. కేంద్రం స్పందనపై వేచి చూస్తున్నారు.
తను మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. వ్యాఖ్యలను ఖండించారు. అందులోని వాయిస్ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత షాక్‌కు గురైనట్టు ట్వీట్ చేశారు. కానీ, ఆయన బుకాయిస్తున్నారని టీటీడీ వర్గాలు గుర్తించాయి. రమణ దీక్షితులకు వ్యతిరేకంగా ప్రధాన అర్చకులు మీడియా సమావేశం పెట్టారు.