Human life : నీ వాళ్లే నిన్ను పక్కన పెడుతారు..పక్కవాళ్లు అసలే పట్టించుకోరు.. అయినా సాగిపో చిరునవ్వుతో!
Human life : మనిషి జీవితం ఒక పువ్వు లాంటిది. మొగ్గగా ఉన్నప్పుడు ముద్దొస్తుంది. ఎప్పుడెప్పుడు కోసుకుందామా అన్నట్టుగా ఉంటుంది. ఆ మొగ్గ పువ్వుగా మారినప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ఎంతో అందంగా ఉంటుంది అలరిస్తుంది..ఆహ్లాదపరుస్తుంది. పవ్వు జీవిత గమనంలో అత్యున్నత దశ ఇదే. దాని జీవిత సార్థకత పువ్వుగా ఉన్నప్పుడే. ఇక ఆ పువ్వు వాడిపోతుంటుంది. అప్పటిదాక జడలో పెట్టుకున్న పువ్వు తీసి అవతల పారేస్తారు. హత్తుకున్న పువ్వే చెత్తగా మారిపోతుంది.
మనిషి జీవితం కూడా అంతే. వయసులో ఉన్నప్పుడు అన్ని అనుభవించే మనిషి..వయసు ఉడిగిపోతుంటే మాత్రం ఎవరికీ పనికిరానికి వాడిగా మారిపోతాడు. వృద్ధాప్యం మొదలయ్యే దశ నుంచి కాటికి వెళ్లే దాక మనిషి జీవితంలో నాలుగు దశలు ఉంటాయని ఓ అమెరికన్ యూట్యూబర్..‘‘ ఫోర్ స్టేజ్ ఆఫ్ ఎలిమినేషన్ ఇన్ లైఫ్..’’ అంటూ ఓ వీడియో చేశాడు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో సారాంశం ఏంటో ఒకసారి చూద్దాం..
మొదటి దశ 60-67 ఏండ్ల వయస్సు:
ఈ దశలో నువ్వు పనిచేసి కీర్తి సంపాదించిన చోటు నిన్ను వెళ్లిపొమ్మంటుంది. అప్పటిదాక నువ్వు ఎంత తోపైనా ఇక నీ సేవలు చాలు అంటుంది నీ వర్క్ ప్లేస్. ఈ దశలో నువ్వు నీ ఆధిపత్యం చెలాయిస్తానని అనుకుంటే నీకే నష్టం. ఇప్పుడు నువ్వొక సాధారణ మనిషివి. వాస్తవాన్ని గ్రహించి సర్దుకుపోవాలి అంతే.
రెండో దశ 70 ఏండ్ల వయస్సు:
ఈ దశలో నిన్ను సమాజం దూరంగా పెడుతుంది. నీ ఫ్రెండ్స్, ఇతర సహచరులు క్రమంగా నిన్ను దూరం పెడుతారు. ఈ దశలో నేను వయస్సులో ఉండగా నేను అది చేశాను..ఇది సాధించాను అంటే నిన్ను గుర్తించే వారు ఎవరుండరు. యంగర్ జనరేషన్ ఎవరూ నిన్ను గుర్తించలేరు.
మూడో దశ 80 ఏండ్ల వయస్సు:
ఈ దశలో నీ కుటుంబం నిన్ను క్రమంగా దూరం పెడుతుంటుంది. నీ పిల్లలు నీ దగ్గర ఉండరు. ఏదో పండుగకో, పబ్బానికో లేకుండా రెండు మూడు ఏండ్లకో నీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే వారి జీవితం చాలా బిజీ కదా. వారి పిల్లల కోసం వారు కష్టపడాలి కదా. అందుకే ఎవరినీ నిందించకు.
నాలుగో దశ 90 ఏండ్ల వయస్సు:
ఈ దశలో నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే నీ జీవితమే నిన్ను పక్కకుపెట్టేందుకు రెడీగా ఉంటుంది. నీ గమ్యం చేరే సమయం ఇది. అయినా చింత వద్దు..ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగేదే. పుట్టిన ప్రతీ జీవి మరణించక తప్పదు. అనవసరంగా చావు గురించి శోపింపవద్దు. జీవితాన్ని హాయిగా నవ్వుతూ అనుభవించాలి. నీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించేందుకు అన్ని దశలను దాటుకుంటూ ఠీవిగా సాగిపోవాలి.