Nakkapally : ఉత్తరాంధ్రలో భారీ ఉక్కు పరిశ్రమ.. నక్కపల్లిలో ఏర్పాటు!
Nakkapally : ఉత్తరాంధ్రలో మరో భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విశాఖ తీరాన ఉన్న దేశంలోనే మొట్టమొదటి పోర్ట్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (వైజాగ్ స్టీల్)కు దీటుగా పక్కనే ఉన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. రెండు దశల్లో రూ.1,50,000 కోట్ల పెట్టుబడులు, 55 వేల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలుగా పేరున్న ఆర్సెలర్ మిట్టల్, నిప్సన్ స్టీల్ కార్పొరేషన్ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద పోర్టు ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. కంపెనీల ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వంతో పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో విడివిడిగా చర్చలు నిర్వహించారు.
ఈ రెండు సంస్థల నుంచి అందిన ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (ప్రి ఫిజిబిలిటీ రిపోర్టు) ఆధారంగా ఏపీఐఐసీ అధికారులు అనకాపల్లి జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుని అవసరమైన భూసేకరణ కూడా పూర్తి చేశారు. ఈ ప్రతిపాదిత భారీ ప్రాజెక్టుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు ఇప్పటికే సీఎం చంద్రబాబుకు చేరింది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం పంపడానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి.