BRS Scam : తెలంగాణ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ(ఐఅండ్ పీఆర్)లో గత పదేండ్లలో జరిగిన వ్యవహారాలు, అక్రమాలపై రేవంత్ సర్కార్ నజర్ వేసింది. పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగినట్టు సర్కార్ గుర్తించింది. డిపార్ట్ మెంట్ లోని ఒకరిద్దరు అధికారులు, బీఆర్ఎస్ లోని కొందరు నేతలు చేతులు కలిపి ప్రజాధనాన్ని దారిమళ్లించినట్టు ప్రభుత్వానికి సమాచారం అందింది. వార్తపత్రికలు, టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కోసం ఈ డిపార్ట్ మెంట్ చేసిన ఖర్చులపై సీఎం వివరాలు తెప్పించకున్నారని తెలిసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రూపాల్లో ప్రకటనలకు దాదాపు రూ.350 కోట్ల దాకా ఖర్చు చేసినట్టు నివేదికలో ఉందని సమాచారం. ఇందులో దశాబ్ది ఉత్సవాల కోసం భారీగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుత బీఆర్ఎస్ లోని ఓ ఎమ్మెల్సీ, అప్పటి సీఎంవోలో పనిచేసిన ఓ బయటి వ్యక్తికి సంబంధించిన సంస్థలు రూపొందించిన వీడియోలనే అప్రూవ్ చేసి వాళ్లకే ఎక్కువ నిధులు అందేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
2014 నుంచి ఏ మీడియా సంస్థకు ఎక్కువ యాడ్స్ ఇచ్చారు? ఎక్కువ నిధులు ఇచ్చారు? అనే దానిపై ప్రభుత్వం రిపోర్ట్ తెప్పించుకుంది. ఇందులో గతంలో అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థలకే పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగినట్టు గుర్తించారు. అలాగే ఇన్ స్టాలో రీల్స్ చేసేవాళ్లకు, యూట్యూబర్ల, ఫేస్ బుక్ పేజీలను మెయింటేన్ చేసేవాళ్లకు కూడా ఐఅండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ నుంచి వెళ్లినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి.
ఐఅండ్ పీఆర్ లో ఓ రిటైర్డ్ ఆఫీసర్ గత రెండేండ్ల నుంచి తిష్ఠ వేసి భారీగా అక్రమాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఆయనను రేవంత్ ప్రభుత్వం తొలగించింది. సదరు ఆఫీసర్ కాలంలో పేపర్ ప్రకటనలు, టీవీ యాడ్స్, ఔట్ డోర్, డిజిటల్ మీడియాకు చేసిన చెల్లింపులన్నింటిని ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఓ మాజీ మంత్రి, ఓ రాజ్యసభ ఎంపీ ఆదేశాలతో ఐఅండ్ పీఆర్ లో ఒకరిద్దరు అధికారులు ఈ కథంతా నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి.
పేరుకు సర్కార్ యాడ్స్ అయినప్పటికీ.. చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అని రిపోర్ట్ వివరాలు చెబుతున్నాయి. ఇతర భాషల పత్రికలకు భారీగా బీఆర్ఎస్ పార్టీ యాడ్స్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి యాడ్స్ వ్యవహారం తెలంగాణలో పెద్ద దుమారమే లేచే అవకాశాలు ఉన్నాయి. వడ్డించే వాడు మనవాడైతే.. అన్నట్టుగా అధికార పార్టీ మీడియా సంస్థలకు కోట్లకు కోట్లు అప్పనంగా అందించిన వ్యవహారంపై రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధ్యులను కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.