Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ తన ఉద్యోగులకు 8 నెలల జీతాన్ని బోనస్ గా అందిస్తున్నట్లు ప్రకటించింది. కళ్లు చెదిరే లాభాలు రావడంతో ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 8 నెలలకు సమానమైన జీతాన్ని బోనస్ గా చెల్లిస్తామని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో సుమారు రూ. 16 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది. ఈ లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్ గా అందిస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించి, చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ దేశాల సరిహద్దులు పూర్తిగా తెరచుకోవడమే తిరిగి సంస్థ లాభాల బాట పట్టడానికి కారణమని సింగపూర్ ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణ వసతుల్ని కల్పించడంతో పాటు తమ ఉద్యోగుల మెరుగైన పనితీరే ఈ వృద్ధికి కారణమని కంపెనీ పేర్కొంది. అందుకే లాభాల్లో కొంత భాగాన్ని ఉద్యోగులు బోనస్ రూపంలో చెల్లిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.