film industry : ప్రపంచంలోనే అతి పెద్ద సినీ పరిశ్రమ అంటే భారతీయ ఫిలిం ఇండస్ట్రీ. ఏటా వేల సంఖ్యలో సినిమాలు ఇక్కడ నిర్మితమవుతుంటాయి. సౌత్ లో ఒక్కో భాష నుంచి సగటున దాదాపు 200 సినిమాలు నిర్మిస్తున్నారు. అంటే ఈ లెక్కన కేవలం దక్షిణాది భాషల్లోనే దాదాపు 800 పైగా సినిమాలు నిర్మాణమవుతున్నాయి. అలాగే హిందీ సినిమాలు మినహాయించి నార్త్ నుంచి దాదాపు 50 0 వరకు సినిమాలు నిర్మి్స్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఏటా 200 వరకు సినిమాలు వస్తున్నాయి. ఇవే కాకుండా వెబ్ సిరీస్ లు, ఓటీటీ మూవీస్ కూడా వస్తున్నాయి.
వెంటాడుతున్న పైరసీ భూతం
సినీ పరిశ్రమను పీడిస్తున్న ప్రధానమైన వాటిలో మొదటిది పైరసీ. ఈ పైరసీ కేవలం ఒక్క ప్రాంతీయ సినిమాకో లేదా హిందీ సినిమాకో పరిమితం కావడం లేదు. అన్ని భాషలో చిత్రాలు పైరసీ అవుతున్నాయి. సినిమా రిలీజైన గంటల్లోనే ఆన్‌లైన్ లో ప్రత్యక్షమవుతున్నది. కొన్నేళ్లుగా దీనిపై అన్ని సినిమా పరిశ్రమల నుంచి నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటీనటులు, టెక్నీషియన్లు ఒక్కటై పోరాడుతున్నా, ఈ పైరసీ భూతాన్ని మాత్రం నివారించలేపోతున్నారు. దీంతో భారతీయ సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున నష్టాన్ని చవిచూస్తున్నది.
గతేడాది 22,499 కోట్ల నష్టం?
పైరసీ కారణంగా సినీ పరిశ్రమ గతేడాది 22,400 కోట్లు నష్టపోయినట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) వారి ‘ది రాబ్ రిపోర్ట్’లో పేర్కొంది. ఈ నివేదికను బుధవారం వెల్లడించింది. భారతదేశంలో వినోదాన్ని ఆస్వాదించే వినియోగదారులు దాదాపు 51 శాతం మంది పైరసీనే ఆశ్రయిస్తున్నారు. వెబ్ సిరీస్‌లు, సినిమాలను వీక్షిస్తున్నది పైరేటెడ్ కావడం గమనార్హం. మొత్తం పైరేటెడ్ కంటెంట్‌లో గరిష్టంగా దాదాపు 63 శాతం కంటెంట్ ఆన్‌లైన్ ద్వారా పొందుతున్నారు. పైరసీని నిరోధించడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ది రాబ్ రిపోర్ట్ పేర్కొంది. ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ఆదాయం పరంగా దేశంలో నాలుగో స్థానంలో ఉన్నది.
థియేటర్ల నుంచే పైరసీ
రాబ్ నివేదిక ప్రకారం సినిమా థియేటర్లలోనే పైరసీ అయినట్లు వెల్లడించింది. థియేటర్లలో సినిమాలను చట్ట విరుద్ధంగా రికార్డు చేయడం ద్వారా 13,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పైరసీ కారణంగా దాదాపు రూ. 8,700 కోట్ల నష్టం సంభవిచింది. దీంతో ప్రభుత్వానికి కూడా రూ.4,300 కోట్ల జీఎస్టీ వసూళ్లు తగ్గాయని అంచనా.