Hussain Sagar : నిన్న (ఆదివారం) భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు సాగర్ కు చేరుకోవడంతో తూము గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా ప్రస్తుతానికి నీటి మట్టం 513 మీటర్లు దాటింది.
ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో చేరుతోంది. 4 గేట్ల నుంచి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ ఎంసీ అధికారులు పరిశీలించారు. రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడిగూడ తదితర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వరదలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రైనేజ్ సమస్యలు, చెట్లు కూలిపోయిన సంఘటనలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు.