MLA Rapaka Varaprasad : వైసీపీ మార్పులు, చేర్పుల వ్యవహారం ఎన్నికల నాటికి ఆ పార్టీకి పెద్ద బొక్కే పెట్టేలా ఉంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక..జగన్ రెడ్డిని నమ్ముకుని రోడ్డున పడే పరిస్థితికి తెచ్చుకున్నారు. టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావును చేర్చుకుని.. రాపాక వరప్రసాద్ ను అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించారు. ఏదో ఓ టికెట్ లే అనుకున్న రాపాకకు రెండు రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ అర్థమయ్యిందేమో కానీ..వెంటనే రివర్స్ అవుతున్నారు. తనకు రాజోలు ఎమ్మెల్యే టికెటే కావాలని ఎంపీ టికెట్ వద్దని అంటున్నారు. తన అనుచరులతో ఆందోళనలు సైతం ప్రారంభించేశారు.
టీడీపీ నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు టికెట్ ఇవ్వడంతో రాపాక అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గతంలో జగనన్న ఏది చెబితే అది చేస్తానని బీరాలు పలికిన రాపాక..ఇప్పుడు అమలాపురం ఎంపీగా పోటీ చేయమనడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తన విధేయతను ప్రదర్శించుకోవడానికి స్టేట్ మెంట్ ఇస్తే నిజంగానే తనను గెంటేశారని ఆయన ఫీల్ అవుతున్నారు. రాజోలు టికెట్ విషయంలో సీఎం జగన్ పునరాలోచన చేయాలంటున్న రాపాక.. సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజోలు సీటు మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
అమలాపురం ఎంపీ టికెట్ విషయంలో జగన్ ఇప్పటికే చాలా మందికి హామీలు ఇచ్చారు. చివరికి ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు కానీ.. ఆ ఒక్క సీటు చూపించి చాలా మంది దళిత నేతల టికెట్లు చించేస్తున్నారు. దీంతో రాపాక మేలుకున్నారు. కానీ రాపాకను జగన్ కేర్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి. పోటీ చేసిన రాపాకకు స్వతంత్ర అభ్యర్థిగా వచ్చిన ఓట్లు 300 మాత్రమే. నియోజకవర్గంలో ఆయనకు ఎలాంటి పలుకుబడి లేకపోవడంతో.. జగన్ పట్టించుకునే అవకాశాలు లేవు. గత ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేసినా జగన్ హ్యాండివ్వడంతో జనసేనలో చేరారు. పవన్ టికెట్ ఇచ్చి గెలిపించడంతో మళ్లీ జగన్ పంచన చేరి పవన్ ను తిట్టారు. ఇప్పుడు మళ్లీ జగన్ హ్యాండిస్తున్నారు. మరి రాపాక ఇప్పుడేం చేస్తారో చూడాలి.