Madhavi Latha : మాధవీలతకు ఆస్తి ఎంతో తెలుసా?
Madhavi Latha : తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో ఎక్కువగా మాట్లాడుకునే సీటు హైదరాబాద్ గురించే. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థిగా మాధవీలత, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీకి దిగింది. సీటు దక్కినప్పటి నుంచి ఎంఐఎంపై విరుచుకుపడుతుంది. పాతబస్తీ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తుంది మాధవీలత. ప్రచారంలో భాగంగా లోక్ సభ సెగ్మెంట్ ను చుట్టేస్తున్న ఆమె తాజాగా నామినేషన్ దాఖలు చేశారు.
తన ఎన్నికల అఫిడవిట్ లో మధవీలత ఆస్తుల వివరాలను ప్రకటించారు. స్థిరచరాస్తులన్నీకలిపి 218 కోట్లు వరకు ఉంటుందని పేర్కొన్నారు. అందులో చరాస్తులు 165.46 కోట్లు.. స్థిరాస్తులు 55.92 కోట్లుగా ఉన్నట్లుగా అఫిడవిట్ లో చెప్పుకచ్చరు. అలాగే, 27.03 కోట్ల అప్పులు కూడా ఉన్నట్లు ప్రకటించారు.
విరించి లిమిటెడ్ లో తన పేరిట రూ. 8.92 కోట్ల విలువైన షేర్లు, ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథ్ పేరిట రూ. 56.19 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని ప్రకటించారు. అన్ లిస్టెడ్ కంపెనీ పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్, గజ్వేల్ డెవలపర్స్‌లో తన పేరుతో రూ. 16.27 కోట్ల షేర్లు ఉన్నట్లు స్పష్టం చేశారు.
తన పేరిట వ్యవసాయ భూములు, వాహనాలు ఏమీ లేవని ప్రకటించారు. ఇంకా.. తన పేరిట ఓ క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో మాధవీలత చెప్పారు.
ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు మాధవీలత. ఒవైసీపై నిప్పులు చెరుగుతూ పాత బస్తీని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచుతున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సారి మాధవీ లతతో అసొదొద్దీన్ గట్టి దెబ్బే ఎదుర్కోవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.