Ayodhya : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు ఇంకా వారం రోజుల గడువు కూడా లేదు. ఈ వేడులకు యావత్ దేశంతో పాటు విదేశాల్లోని ప్రముఖులకు కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆహ్వానాలు పంపించింది. జనవరి 22వ తేదీన అయోధ్యకు వెళ్లాలని చాలా మంది ఆశ పడుతున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం అయోధ్యకు ఆ రోజు కాకుండా మరో రోజు వెళ్తే బాగుంటుందని చెప్తున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు వస్తారు కాబట్టి ఆ రోజు కాకుండా మరో రోజు రావాలని సూచిస్తున్నారు. అయోధ్యకు వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుంది.. ఎలా వెళ్లాలి.. అక్కడికి వెళ్తే బస ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి.. తదితర విషయాలను ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈజ్ మై ట్రిప్, ఎస్‌ఓటీసీ, థామస్ కుక్ తదితర ట్రావెల్ సంస్థలు.. అయోధ్య వేడుకకు హాజరయ్యేందుకు చాలా మంది ఎంత ఖర్చయినా భరిస్తామని చెప్తున్నారని అంటున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం 7 వేల మందికి ఆహ్వానాలు పంపించారు.
థామస్ కుక్, ఎస్‌ఓటీసీ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల, హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధరలు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉన్నాయి. ఇతర సమయాల కంటే ప్రస్తుతం విమాన ఛార్జీలు అధికంగా ఉన్నాయి. మేక్ మై ట్రిప్‌లో జనవరి 20న ముంబై నుంచి అయోధ్యకు వన్‌వే ఫ్లైట్ టికెట్ రూ.17,900 నుంచి రూ.24,600 వరకు ఉంది. అదే సమయంలో జనవరి 21 నాన్‌స్టాప్ విమానానికి రూ.20,699. జనవరి 20వ తేదీ కోల్‌కతా నుంచి అయోధ్యకు విమాన టిక్కెట్ల ధర రూ.19,456 నుంచి రూ.25,761 ఉంది. బెంగళూర్ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే జనవరి 20వ తేదీకి రూ. 23,152 నుంచి రూ. 32,855 వరకు టిక్కెట్ల ధర ఉంది.
ఈజ్ మై ట్రిప్ లో వివరాల ప్రకారం.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి 7వేల మంది అతిథులు హాజరుకానున్నారు. 22వ తేదీ తర్వాత ప్రతి రోజూ 3 నుంచి 5 లక్షల మంది భక్తులు అయోధ్యకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది.
రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యలోని హోటళ్లు పూర్తిగా బుక్కయ్యాయి. హోటళ్లలో గదుల ఆక్యుపెన్సీ రేటు 80 నుంచి 100 శాతానికి చేరుకుంది. కొన్ని హోటళ్లలో రాత్రిపూట గది అద్దె ధర రూ.70 వేల వరకు ఉందని చెప్తున్నాయి. అందుకే అయోధ్యకు వచ్చే చాలా మంది భక్తులు పగటిపూట అయోధ్యలో ఉంటూ, రాత్రి లక్నో లేదంటే ప్రయాగ్‌రాజ్‌లో బస చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.