PM Modi-CM Revanth : కేసీఆర్ కు, రేవంత్ కు ఎంత తేడా? మోదీ మనసు గెలిచిన కాంగ్రెస్ సీఎం
PM Modi-CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని పర్యటన వేళ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆయన మనసు గెలుచుకున్నారు. గతంతో కేసీఆర్ చేసిన తప్పులను తన పాలనలో కనపడనివ్వకుండా రేవంత్ జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనపెడుదామని చెప్పారు. రాష్ట్రాలకు ప్రధాని పెద్దన్నగా అభివర్ణించారు. మోదీ ఆశీస్సులుంటే గుజరాత్ లాగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. రేవంత్ చేసిన అభ్యర్థనకు మోదీ సానుకూలంగా స్పందించారు.
ప్రధాని పర్యటనను సీఎం రేవంత్ సద్వినియోగం చేసుకున్నారని రాజకీయవర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. తొలుత బీజేపీతో సఖ్యతగా వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ తర్వాతి కాలంలో మోదీని టార్గెట్ చేసి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయంపై రేవంత్ పూర్తి అవగాహన ఉంది. అందుకే తాను సీఎం అయిన తర్వాత ఢిల్లీ పర్యటనలోనూ ప్రధానిని కలిశారు.
కేంద్రం-రాష్ట్రం మధ్య పాలనా పరంగా సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీని ఆకట్టుకునే విధంగా వ్యవహరించారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా ఐపీఎస్ ల కేటాయింపు, కంటోన్మెంట్ లో ప్రభుత్వం కోరిన స్థలం కేటాయించారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్రానికి వచచారు. ప్రధానికి రేవంత్ అధికారికంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయమంతా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. ఒక పెద్దన్న మాదిరి ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్ని విధాలా సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధికి సహకరించాలని కోరారు. మెట్రో రైలు విస్తరణ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్ లో 175 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ తన ప్రసంగంలో ప్రధాని మోదీని ఎక్కడా నొప్పించకుండా.. పూర్తిగా తన లక్ష్యాలు చేరుకునేందుకు ఒప్పించే విధానంలోనే మాట్లాడడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.