AP Assembly Elections : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి? గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎలాంటి మార్పు కనిపించిం అన్నది చూద్దాం. ఎన్డీయే కూటమికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏకంగా 53 లక్షల 72 వేల 166 ఓట్ల తేడా ఉంది. ఒక్క టీడీపీతో పోల్చినా వైసీపీకు 21లక్షల 442 ఓట్లు తక్కువ పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో టీడీపీ 135 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. వైసీపీ 11స్థానాలకే పరిమితం అయ్యింది. మెజార్టీల పరంగా కూడా కూటమి అభ్యర్థులు భారీ విజయాలను నమోదు చేశారు. టీడీపీకి చెందిన పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, నారా లోకేష్.. ఏకంగా 91వేలకుపైగా మెజార్టీ సాధించుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ప్రకటించిన లెక్కలను బట్టి చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 55.29ఓట్ల శాతాన్ని దక్కించుకున్నాయి. మూడు పార్టీలు కలిపి కోటి 86 లక్షల 56 వేల 300 ఓట్లు దక్కించుకున్నాయి. ఇందులో టీడీపీదే ఎక్కువ వాటా.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు కలిసి వెళ్లడంతోనే భారీ విజయాన్ని నమోదు చేశాయి. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా ప్రధాన పార్టీలన్నీ వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ 23 స్థానాలు, జనసేన ఒక చోట గెలుపొందాయి. అప్పట్లో పార్టీ వారీగా వచ్చిన ఓట్లు, శాతాలను ఒకసారి గమనిస్తే.. పార్టీల వారీగా తీసుకుంటే టీడీపీకి ప్రస్తుతం వచ్చిన ఓట్ల కంటే 2019లో వైసీపీకి వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు 144 స్థానాలలో పోటీ చేసిన టీడీపీకి సొంతంగా వచ్చిన ఓట్ల కంటే అప్పట్లో 175 సీట్లలో పోటీ చేసిన వైసీపీకి 3,03,993 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీకి 39.17శాతం ఓట్ల శాతంతో 1,23,04,668 ఓట్లు వచ్చాయి. ఈసారి దాదాపు 30 లక్షల ఓట్లను అధికంగా దక్కించుకుంది.