Sajjala Ramakrishna : జగన్‌కు శల్యసారధ్యం వహించిన సజ్జల రామకృష్ణా రెడ్డి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మేధావిలా, నిష్కళంకమైన రాజకీయ నాయకుడిలా, ఎంతో సౌమ్యమూర్తిలా బిల్డప్ ఇస్తారు. ఆయన వితండవాదం చేస్తున్నారని అందరికీ అర్థం అవుతున్నప్పటికీ ఆయన చాలా చక్కగా, మృధువుగా చెప్తుంటే అబద్ధం కూడా నిజమేనేమో అన్న అనుమానం కలుగుతుంది.
కానీ సినిమాల్లో మొదట మంచి వాడిగా కనిపించి చివరిలో విలన్‌గా మారిపోయి అసలు రూపం చూపిస్తున్నట్లుగా.. వైసీపీ పాలనలో ఆయన చేసిన అకృత్యాలు, వేధింపులు, బెదిరింపులు, దోపిడీలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి.
నాలుగు, ఐదు రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు సూర్యనారాయణ మీడియా ముందుకు వచ్చి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి తనను ఎంతలా వేధించారో, ఎంతలా బెదిరించారో వివరించారు.
ఇంతకీ సూర్యనారాయణ చేసిన నేరం ఏంటంటే, ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చి జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరడం. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను కలవడం.
రీసెంట్ గా నెల్లూరు జిల్లాలో సజ్జల మరో బాగోతం బయటపడింది. జిల్లాలోని సైదాపురం మండలంలోని జోగుపల్లిలో వ్యాపారి బద్రీనాథ్ కు 240 ఎకరాల విస్తీర్ణంలో 8 క్వార్జ్ గనులున్నాయి. వేల కోట్ల విలువైన వాటిపై సజ్జల కళ్లు పడ్డాయి.
తన అనుచరులు శ్రీ చరణ్, కృష్ణయ్య ద్వారా తనను బెదిరించి రెండేళ్లుగా సుమారు 500 నుంచి 800 కోట్ల టన్నులు తవ్వేసి అమ్మేసుకున్నారని బధ్రీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ప్రభుత్వంలో సజ్జలదే పెత్తనం కావడంతో పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోగా, మళ్లీ సజ్జల, ధనుంజయ్ రెడ్డి బెదిరించడంతో దోపిడీని మౌనంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చిందని చెప్పారు. నాడు ఏపీ సీఐడీ అధికారులు కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి కనుసన్నల్లో పనిచేయక తప్పేది కాదు. ఇప్పుడు అదే సీఐడీ అధికారులకు బధ్రీనాథ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఒంగోలు పట్టణంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ పక్కనే కోట్ల విలువైన సుమారు 1,800 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు టెండర్లు పిలిస్తే, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానిలో పాల్గొన్న మిగిలిన ఇద్దరినీ బెదిరించి తప్పుకునేలా చేసి దానిని నామ మాత్రపు అద్దెకు దక్కించుకున్నారని ఫిర్యాదులు నమోదవుతున్నాయి.
జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో సుమారు 2 ఎకరాల చొప్పున మొత్తం 42 ఎకరాలు ఇదే పద్ధతిలో వైసీపీ కార్యాలయాల కోసం కేటాయించేసుకొని భవనాలు కూడా నిర్మించారన్న వార్తలు అందరూ చూసే ఉంటారు. రాబోయే రోజుల్లో ఇలాంటి భాగోతాలు ఎన్ని చూడాలో? వైసీపీలో ఇంకెన్ని ఇలాంటి ఆణిముత్యాలున్నాయో?