American Team : అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరిగే టీ-20 వరల్డ్ కప్ కు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఐపీఎల్ లో అదరగొడుతున్న కొత్త కుర్రాళ్లతో ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావిస్తే..అనూహ్యంగా సీనియర్లకే చాన్స్ ఇచ్చారు. 2022 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఆడిన 8మందికి మళ్లీ చోటు దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు జట్టు ఎంపికలో సీనియారిటీకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో. అయితే యశస్వి జైస్వాల్, శివం దూబే జట్టులో ఉండడంతో కొంత కొత్తదనం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈక్రమంలో శుక్రవారం టీ 20 వరల్డ్ కప్ కు అమెరికా సైతం తన టీమ్ ను ప్రకటించింది.
ఈ టీమ్ లో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉండడం విశేషం. జాబితాలోని 15 మందిలో ఏడుగురికి భారత మూలాలున్నాయి. గుజరాత్ అండర్-19 జట్టుకు ఆడిన వికెట్ కీపర్, బ్యాటర్ మోనాంక్ పటేల్..ఇప్పుడు అమెరికా జట్టుకు కెప్టెన్. 2018-19 రంజీ ట్రోఫీ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన మిలింద్ కుమార్ అమెరికా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో సిక్కిం తరఫున 1331 పరుగులు చేసిన మిలింద్.. దేశవాళీల్లో ఢిల్లీ, త్రిపుర, సిక్కిం తరఫున ఆడాడు.
ముంబై మాజీ బౌలర్లు హర్మీత్ సింగ్, సౌరభ్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యారు. అయితే 2012 అండర్-19 ప్రపంచకప్ లో భారత్ ను గెలిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ మాత్రం అమెరికా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా, పాకిస్తాన్ సంతతి పేసర్ అలీ ఖాన్ కూడా అమెరికా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. భారత్, కెనడా, పాకిస్తాన్, ఐర్లాండ్ తో కలిసి అమెరికా గ్రూప్-ఏలో ఉంది.
అమెరికా జట్టు:
మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్, షాడ్లీ, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్.