Modi 3.0 : మోదీ 3.0లో ఏ రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులంటే..

Modi 3.0

Modi 3.0 cabinet

Modi 3.0 Cabinet : మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో  మరో 71 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వారిలో 61 మంది బీజేపీకి చెందిన వారు కాగా మిగిలిన 11 మంది ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన వారు. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా, ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుఉన్నారు. పలువురు సీనియర్లకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కింది. వారిలో అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌గోయెల్‌, నిర్మలాసీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, జితేంద్ర సింగ్‌ కేబినెట్‌ మంత్రులుగా మూడోసారి ప్రమాణం చేశారు. బీజేపీ నేషనల్‌ చీఫ్‌ జేపీ నడ్డాను ఈసారి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.  కాగా, గతంలో మంత్రులుగా పనిచేసిన చాలా మందికి ఈసారి బెర్త్ దొరకలేదు. వారిలో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ వంటి వారు ఉన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి పదవులు దక్కాయి.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొందిన బీజేపీ నేత శ్రీనివాస వర్మ, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ తరపున కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది.

మోదీ 3.0లో ఉత్తరాది రాష్ట్రాల వారికి గతంలో మాదిరిగానే ప్రాధాన్యం దక్కింది. యూపీ నుంచి 10 మందికి కేంద్ర మంత్రి పదవులు దక్కగా, బిహార్ కు 8, మహారాష్ట్ర నుంచి ఆరుగురికి కేంద్రమంత్రి పదవులు దక్కాయి. గుజరాత్‌ నుంచి ఐదుగురు, కర్ణాటక నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లకు నాలుగు చొప్పున మంత్రి పదవులు, జార్ఖండ్‌ ,బెంగాల్‌ నుంచి ఇద్దరి చొప్పున మంత్రి పదవులు, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, జమ్మూ కాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. కాగా, నేడో, రేపో వీరందరికీ శాఖలు కేటాయించనున్నారు.

TAGS